- సీఎం చంద్రబాబు సంతాపం
- కుటుంబానికి అండగా ఉంటామని హామీ
అమరావతి(చైతన్యరథం) : తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, పసుపు సైనికుడు మిర్జా మొహమ్మద్ అలీ మృతి బాధాకరమని సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా, పమిడిముక్కల మండలం, అలినఖీ పాలెం గ్రామానికి చెందిన మొహమ్మద్ అలీ శనివారం ఉదయం కన్నుమూశారు. 1983 నుంచి అలీ కార్యకర్తగా ఉంటూ పార్టీ కోసం నిరంతరం పని చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎప్పుడు పార్టీ కార్యాలయానికి వెళ్లినా పసుపు దుస్తుల్లోనే కనిపించి పార్టీ పట్ల తన అభిమానాన్ని చాటుకునేవారని గుర్తు చేసుకున్నారు. మహమ్మద్ అలీ కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మిర్జా మొహమ్మద్ అలీ పార్టీ ఆవిర్భావం నుంచి అనగా 1983 నుంచి కార్యకర్తగా పనిచేసి, అంచలంచలుగా ఎదుగుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో పమిడిముక్కల మండలంలో తెలుగుదేశం పార్టీ అనేక విజయాలని సాధించింది. పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా వారు అంకితభావంతో పార్టీ కోసం పని చేస్తూ నిత్యము పసుపు రంగు చొక్కా అని ధరించి తన నిబద్ధతను చాటుకునేవారు.
పార్టీకి తీరని లోటు: మంత్రి లోకేష్
తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ పసుపు జెండా భుజాన మోసిన అంకితభావం కలిగిన టీడీపీ సైనికుడు అలీ మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలియజేశారు. మిర్జా మొహమ్మద్ అలీ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీయే ప్రాణంగా భావిస్తూ పనిచేశారన్నారు. ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ రంగు పసుపు దుస్తులనే ధరించే అలీ సాబ్ లేని లోటు తీరనిదంటూ, ఆయన కుటుంబసభ్యులకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.