- విచారణలో ఒక్కో అంశం వెలుగుచూస్తోంది
- అన్నదాతలకు నష్టం చేయాలని చూశారు
- ఎంతటివారైనా కఠినచర్యలు తీసుకుంటాం
- ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారు
- రెండురోజుల్లో కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ
- రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
విజయవాడ(చైతన్యరథం): ప్రకాశం బ్యారేజీని ఐదు బోట్లు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతుందని, అన్నదాతలను నష్టపరిచేందుకు ప్రయత్నించిన వారిపై చట్టపరం గా కఠిన చర్యలు తప్పవని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. సోమవారం మంత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. 1854 నుంచి 1952 వరకు దాదాపు 100 సంవత్సరాల పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు బ్యారేజీ సేవలందించిందని, 1952లో వచ్చిన వరదలకు బ్యారేజీ దెబ్బతినడంతో ప్రభుత్వం పునర్నిర్మాణం చేసి మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టడం జరిగిందన్నారు. 1957 నుంచి దాదాపు 13.8 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందుతున్నాయని, బ్యారేజీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు వరప్రదాయనిగా నిర్విరా మంగా సేవలందిస్తోందని తెలిపారు. పాత ఆనకట్ట వంద సంవత్సరాలు, కొత్త ఆనకట్టకు దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే దాదాపు 170 ఏళ్ల ఘన చరిత్ర ప్రకాశం బ్యారేజీకి ఉంది. 11,42,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిన కీలక పరిస్థితిలో ఐదు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం వెనుక కుట్రకోణం ఉందనే అభిప్రాయం అందరిలోనూ ఉందన్నారు. ఘటనపై వాస్తవాలను వెలికి తీసేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచా రణ చేస్తున్నాయని తెలిపారు.
ఘటనపై చాలా అనుమానాలు ఉన్నాయి
ఒక్కొక్కటి 40-50 టన్నుల బరువున్న ఐదు బోట్లు అధిక వరద వస్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లను దాటుకుని కౌంటర్ వెయిట్‌ను బలంగా ఢీకొట్టాయి. కౌంటర్ వెయిట్‌ను కాకుండా గేట్లను, ప్రధాన కట్టడాన్ని ఢీకొని ఉంటే ఐదారు జిల్లాలకు ఎంత నష్టం జరిగేదో ఊహించడానికి కష్టంగా ఉంది. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ శాఖ నుంచి పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయడంతో వేగంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ మొత్తం ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని రైతులు, రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇలాంటి అధిక బరువు కలిగిన బోట్లను సాధారణంగా నది ఒడ్డున లంగర్ వేసి ఉంచుతారు. ఒక్కో బోటు విలువ రూ.40-50 లక్షలు ఉంటే.. అంతటి విలువైన 3 బోట్లను ఒకే ప్లాస్టిక్ తాడుతో కట్టడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఇంతటి విలువైన పడవలను జాగ్రత్త చేసుకోకుండా ఉద్దేశ పూర్వకంగానే ఇలా బ్యారేజీని ఢీకొట్టేలా చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి.
బోట్ల యజమానికి వైసీపీతో సంబంధాలు
మొత్తం ఐదు బోట్లలో ఒకటి గేట్ల మధ్య నుంచి కిందకు వెళ్లిపోగా మూడు బోట్లను గుర్తించడం జరిగింది. మరో బోటు ఆచూకీ తెలుసుకుంటున్నాం. గుర్తించిన మూడు బోట్లకు యజమాని ఒకరే కావడంతో అనుమానానికి దారితీస్తోంది. వాటి యజమాని అయిన ఉషాద్రి అనే వ్యక్తి కోమటి రామ్మోహన్‌కు అనుచరుడిగా ఉన్నారు. ఈ రామ్మోహన్ కు తలశిల రఘురాంతో బంధుత్వం ఉంది. గత ప్రభుత్వ అండదండలతో నందిగం సురేష్ వీరంతా సిండికేట్‌గా ఏర్పడి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను అక్రమంగా లూటీ చేశారు. పడవలకు వైసీపీ రంగులు కూడా ఉండడం ఇలా దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు వస్తోందని వివరించారు. బోట్లను లంగరు వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలని స్థానికులు చెప్పినా సరే నిర్లక్ష్యం చేశారంటే వారి మనసులో వేరే తప్పుడు భావన ఉందని దర్యాప్తులో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు బోట్లు అంతకుముందు గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెం వైపు ఉండేవి.. ఈ వరదకు కొన్ని రోజుల ముందే వాటిని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ప్లాస్టిక్ వైరుతో కట్టి ఉంచినట్లు తెలుస్తోంది. అంటే ఉద్దేశపూర్వకంగానే వరద వేగానికి కొట్టుకొచ్చేలా ఉంచారా అనే అనుమానం వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డపేరు కలిగించాలనే ఆలోచన వారిలో ఉందా అనే అనుమానం కలుగుతుంది. వైసీపీకి మొదటి నుంచి కూడా కుర్చీ కోసం, పద వుల కోసం బరితెగించే మనస్తత్వం ఉంది. రైతు ఆరుగాలం శ్రమించి కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు సైతం నిప్పు పెట్టిన చరిత్ర వారిది. తప్పులు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రెండురోజుల్లో కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ
ప్రస్తుతం అనుభవజ్ఞులైన కన్నయ్యనాయుడు నేతృత్వంలో కౌంటర్ వెయిట్లను ఐరన్ దిమ్మలతో ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. రెండురోజుల్లోగా పనుల పూర్తి చేసేం దుకు కృషిచేస్తున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరద ప్రవాహం వెళుతుండ గానే తుంగభద్ర డ్యామ్ గేటును బిగించే పని కన్నయ్యనాయుడు నేతృత్వంలోనే జరిగింది. వరద ప్రవాహానికి గేటు కొట్టుకుపోతే రైతుల కళ్లల్లో నీళ్లు చూశాను.. మళ్లీ తిరిగి గేటు అమర్చిన తర్వాత అదే రైతుల కళ్లల్లో ఆనందం చూశానని ఆరోజు కన్నయ్య నాయుడు చెప్పారు. అందుకే ఆయన సూచనలతోనే ప్రకాశం బ్యారేజీ విషయంలో కూడా ముందు కెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటుకు తావు లేకుండా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రాజకీయంగా కాకుండా ప్రకాశం బ్యారేజీ భద్రత పరంగా గేటు కొట్టుకుపోయిన ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.