- మహిళల అభ్యున్నతికి, సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
- పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల
తిరుపతి (చైతన్యరథం): పేదల సమస్యలు అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దీపం – 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శనివారం సాయంత్రం తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీ మునిసిపల్ ప్రైమరీస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన దీపం `2 ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద మహిళల కష్టాలు తీర్చేందుకు దీపం `2 పథకం కింద సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సీఎం చంద్రబాబు అందజేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో గతంలో కూడా దీపం పథకం కింద పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించారన్నారు.
ఇప్పడు దీపావళి పండుగ కానుకగా దీపం `2 పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. కోటి యాభై లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ మొత్తంలో సామాజిక పెన్షన్లు మన రాష్ట్రంలోనే ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్‌ను రూ. 3000 నుంచి రూ.4000కు పెంచామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. అన్నీ ప్రణాళికా బద్ధంగా చేపడుతున్నామని, విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూటమి నేతలు, కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారు. యాక్టివ్ గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మూడు ఉచిత సిలిండర్ల పథకానికి అర్హులని తెలిపారు. దీపం- 2 పథకంలో ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లను ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తుందన్నారు. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొనే లబ్ధి దారులు ముందు సొమ్ము చెల్లిస్తే.. ఆ మొత్తం వారి వ్యక్తిగత ఖాతాలకు 24 గంటల నుండి 48 గంటల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.
జేసీ శుభం బన్సల్ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఈ- కేవైసీ ఇబ్బందులు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించి అర్హులైన అందరికీ దీపం `2 పథకం లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం అధికారులతో కలిసి లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను మంత్రి పంపిణీ చేశారు. తరువాత అదే వార్డులో రోడ్డుపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, తిరుపతి ఆర్డీఓ రాంమోహన్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తూడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతకు ముందు తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి నాదెండ్లకు శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు, సివిల్ సప్లైస్ డిఎం సుమతి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజు, రేణిగుంట ఇన్‌ఛార్జి తహసీిల్దార్ శ్యామ్ ప్రసాద్, ప్రజా ప్రతినిధులు తదితరులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో మంత్రికి స్వాగతం పలికారు.