- స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఈ నెల 20 తరువాతే
- ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై తదుపరి విచారణ 30న
- ఈ నెల 12 నుంచి 19 వరకు కోర్టుకు వారాంతపు, దీపావళి సెలవులు
న్యూఢిల్లీ : తనపై అక్రమంగా నమోదు చేయబడిన స్కిల్ డెవలప్ మెంట్ కేసుని క్వాష్ (రద్దు) చేయాలని సుప్రీంకోర్టులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పు కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ప్రజలు మరికొంత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ విషయంపై.. గత నెల సుప్రీంకోర్టు ఇచ్చిన సంకేతం ప్రకారం తీర్పు గురువారంలోగా రావాల్సి ఉండగా, ద్విసభ్య ధర్మాసనం దీపావళి సెలవుల తర్వాత తీర్పునిస్తామని గురువారం వెల్లడిరచింది. అవినీతి నిరోధక సవరణ చట్టం, 2018లోని సెక్షన్ 17(ఏ) ప్రకారం మాజీ ముఖ్యమంత్రి అయిన తనపై కేసులు పెట్టే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవలసి ఉంటుందని, జగన్ రెడ్డి ప్రభుత్వం అలా చేయకుండా చట్టాన్ని ఉల్లంఘించినందున స్కిల్ కేసును క్వాష్ చేయాలని ముందు చంద్రబాబు హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం దాన్ని తిరస్కరించడంతో ఆయన సుప్రీం తలుపు తట్టారు.
క్వాష్ పిటిషన్ తో పాటు చంద్రబాబు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు గతనెల 17న ముగిశాయి. చివరి రోజు విచారణ సందర్భంగా.. ముందస్తు బెయిల్ విచారణను నవంబర్ 9కి వాయిదా వేస్తూ.. అంతకుముందే చంద్రబాబుకి 17 (ఏ) వర్తింపుపై తీర్పునిస్తామని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం లోగా 17 (ఏ) విషయంపై సుప్రీంతీర్పు వస్తుందని పలువురు భావించారు.
కొత్త గడువులు
సుప్రీం ధర్మాసనం గతనెలలో చెప్పిన మేరకు స్కిల్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ నిన్న విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా … కొన్ని అంశాలు క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్లతో ముడిపడి ఉండటం వల్ల ముందస్తు బెయిల్ విచారణను ధర్మాసనం ఈ నెల 30కి వాయిదా వేస్తూ, క్వాష్ పిటిషన్ పై తీర్పుని దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని చెప్పింది. వారాంతపు, దీపావళి సెలవుల సందర్భంగా ఈ నెల 12 నుంచి 19 వరకు సుప్రీంకోర్టు పనిచేయదు కనుక క్వాష్ పిటిషన్ పై తీర్పు ఆ తరువాతే రాగలదు.
చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎట్టి సాక్ష్యాధారాలు చూపకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ ఆయన్ని అక్రమంగా, హడావుడిగా సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసి తప్పుడు రిమాండ్ రిపోర్టుతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపింది. 52 రోజుల జైలు నిర్బంధం తర్వాత మెడికల్ బెయిల్ పై చంద్రబాబు గత నెల 31న విడుదలయ్యారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ చంద్రబాబు ఈనెల 28న తిరిగి జైలుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. బయటకు వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు పలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ…కుడి కంటికి శుక్లం ఆపరేషన్ కూడా చేయించుకున్నారు.
చంద్రబాబుకు ఈ నెల 28 వరకు ఆరోగ్య కారణాల వలన మధ్యంతర బెయిల్ లభించినందున అప్పటివరకు ఆయన్ని అరెస్ట్ చేయమని సీఐడీ గతనెల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈలోగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని….దానితో పాటు ఆయనపై నమోదైన ఇతర అవినీతికేసులు వీగిపోతాయని న్యాయనిపుణుల అభిప్రాయం.