- ఓటర్ల జాబితాల్లో లెక్కలేనన్ని అక్రమాలు
- సీనియర్ అధికారులను సైతం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు
- ఏపీలో జగన్ సొంత వ్యవస్థ ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహణ
- వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల కనుసన్నల్లోనే ఓటర్ల చేర్పులు, తొలగింపులు
- వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి
- టీడీపీ ఓట్లను ఇష్టానుసారం తొలగిస్తున్నారు
- చర్యలు తీసుకోవాలని సీఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు
న్యూఢీల్లి: ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా ఓట్ల తొలగిం పు, దొంగ ఓట్ల చేర్పులపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి ఫిర్యాదు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తెదేపా ఓట్లే లక్ష్యంగా ఓట్లు తొలగించడంపై సీఈసీ కి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలోని తెదేపా నేతల బృందం మంగళ వారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తదితరులు ఈసీని కలిసిన వారి లో ఉన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద ఒక విధానం అను సరిస్తుంటే ఏపీలో మరో విధానాన్ని అనుసరిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారు చేస్తున్నట్లు సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అధికారులు పాటించడం లేదు. అధికార యంత్రాంగమంతా ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లో పని చేస్తోంది. అధికారులను సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టు చేయక పోతే వారిపై కేసులు పెడతామని సీనియర్ ఐఏఎస్ అధికారు లను బెదిరిస్తున్నారు. కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులను ఏపీలోని జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించాలి. దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటారు. కానీ ఏపీలో సీఎం జగన్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారి కనుసన్నల్లోనే ఎన్నికలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని సీఈసీకి స్పష్టంగా చెప్పాం. అక్టోబర్ 27 వరకు దేశమంతా ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది. ఏపీలో ఆ విధానం పూర్తిగా జరగలేదు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా సీఈసీకి వివరించాం.
రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఫారమ్ 6, ఫారమ్ 7. ఫారమ్ 8ని దరఖాస్తులు చేశారు. వీటిపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించలేదు. గతంలో ఏపీలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే పోలింగ్ బూత్ పరిధిలోకి వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో పేరు నమోదు చేశారు. రాష్ట్రంలో డెత్ సర్టిఫికెట్లతో సహా చనిపోయినవారి వివరాలు ఇచ్చాం. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా చూపించాం. అయితే, ఈ ఓట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం తొలగించలేదు. వాలంటీర్ వ్యవస్థను వినియోగించి తెదేపా సానుభూతిపరుల ఓట్లను మాత్రం ఇష్టానుసారంగా తొలగిస్తున్నారు. సుమారు 160 పోలింగ్ స్టేషన్లు ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరాం. గ్రామ సచివాలయ ఉద్యోగులను బీఎల్‌వో (బూత్ లెవల్ ఆఫీసర్లు)గా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం వై ఏపీ నీడ్స్ జగన్ అని ఒక కార్యక్రమం పెట్టారు. దాంట్లో గ్రామ సచివాలయం అధికారులను నియమించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీ జెండాలు పట్టుకుని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇలా ఇష్టానుసారంగా చేయడం పై సీఈసీ దృష్టికి తీసుకెళ్లాము. గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల ప్రక్రియను దూరంగా ఉంచాలని చెప్పాం. దొంగ ఓట్లు తొలగించాలని సీఈసీని కోరాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు తెలిపారని అచ్చెన్నాయుడు వెల్లడిరచారు.