అమరావతి,చైతన్యరథం: అధికారాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ కార్యాలయాలను అనుతులు లేకుండానే నిర్మించారనే విషయం వెలుగులోకి వచ్చింది. అలా అమరావతిలోని తాడేపల్లిలో నిర్మిస్తున్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు శనివారం కూల్చేశారు. తాడేపల్లిలోని బోట్ యార్డులో 17 ఎకరాల ఇరిగేషన్ శాఖకు చెందిన భూమి ఉంది. అందులో పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం కోసం రెండు ఎకరాలు కేటాయించాలని వైసీపీ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై తెనాలి సబ్ కలెక్టర్ స్పందిస్తూ ఈ స్థలం కావాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి కావాల్సి ఉంటుందని తెలిపారు. సీపీఎల్‌ఏ కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలిపింది. అయితే జగన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం మాత్రం ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోకుండానే తమ పార్టీకి రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 16.2.2023న ఈ స్థలం కేటాయింపుకు సంబంధించి జీవో నెం.52ను విడుదల చేస్తూ ఈ స్థలం తీసుకోవాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. అంతేకాక గతంలో పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం కోసం కొరిటపాడులో కేటాయించిన 98 సెంట్ల స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా జీవోలో నిర్దేశించారు. కానీ అప్పటికే 02.02.2003న ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ సి.నారాయణ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాస్తూ బోర్డు యార్డులోని రెండెకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి కేటాయించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దమని, తాము అనుమతినివ్వబోమని చెప్పారు. ఆయన తన నివేదికలో మొత్తం 17 ఎకరాల స్థలం ఉంటే అందులో 9 ఎకరాల్లో కాలువ పారుతోందని, ఐదెకరాలను రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం రెవిన్యూ శాఖ కోరిందని, మిగిలింది మూడు ఎకరాలు మాత్రమేనని, అది కూడా నదీ తీర ప్రాంతమని తెలిపారు. కాగా జీవోను అనుసరించి ఆ భూమని అప్పగిచ్చేందుకు ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోకుండానే సీసీఎల్‌ఏ, కలెక్టర్‌లు ఆ భూమిని తాహశీల్దార్‌కు ఎండార్స్ చేసి చేతులు దులుపుకున్నారు. తాహశీల్దారు ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోకుండానే ఆ భూమిని వైసీపీకి అప్పగించేశారు. దీనిపై ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మున్సిపల్ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాలంటూ వైసీపీకి రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఎంతకీ వైసీపీ నుండి సమాధానం రాకపోవడంతో 14.06.2024న కూల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతను అపేందుకు ఎటువంటి స్టే ఇవ్వలేదు. చట్టబద్దంగా చర్యలు తీసుకోమని చెప్పింది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మున్సిపల్ శాఖ అధికారులు శనివారం నాడు నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు. వైజాగ్‌లోని ఎండాడలో, అనకాపల్లిలో, నెల్లూరు నగరంలో నిర్మించిన పార్టీ కార్యాలయాలకు కూడా అనుమతులు లేవని అధికారులు తెలిపారు. వైజాగ్, అనకాపల్లి కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతుల్లేకుండా ఎలా కట్టారో తెలిపాలంటూ అడిగారు. కాగా జగన్‌రెడ్డితోపాటు, వైసీపీ నాయకులు కేంద్ర కార్యాలయం కూల్చివేతపై గగ్గొలు పెడుతున్నారు. తమకు కేటాయించిన లీజు స్థలంలో తమ పార్టీ ఆఫీసు కట్టుకుంటే తప్పెలా అవుతుందని బుకాయిస్తున్నారు. కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే, ప్లాన్ అప్రూవల్స్ లేకుండానే ఈ కార్యాలయాలు కట్టారనే విషయంపై మాత్రం నోరు మెదపడం లేదు.