- సరస్వతి’పై సమగ్ర దర్యాప్తు
- బాంబులు విసిరి భూములు లాక్కున్నారు
- పవర్‌ప్లాంట్ భూములపై సమగ్ర విచారణ
- రైతులకు అండగా నిలబడతాం..
- వైసీపీ అధికారంలో ఉన్నట్టే భావిస్తోంది
- ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదు..
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక
మాచవరం (చైతన్య రథం): ప్రజల ఆస్తులు లాక్కొని.. తమ సొంత ఆస్తిలా భావించి జగన్ కుటుంబీకులు కొట్లాడుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. వైకాపా నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామనే భావిస్తున్నారని, ఎవరైనా ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను పవన్ మంగళవారం పరిశీలించారు. ఆయనవెంట ఎమ్మెల్యే యరపతినేని, కలెక్టర్, అటవీ, రెవెన్యూ అధికారులు ఉన్నారు. భూములకు సంబంధించిన వివరాలను అధికారులు పవన్‌కు వివరించారు. భూములను పరిశీలించిన అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ‘సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం గత ముఖ్యమంత్రి, వైకాపా అధినేత సొంతంగా భూములు తీసుకున్నారు. 2009లో వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు 30 ఏళ్లు లీజుకు తీసుకోగా.. జగన్ సీఎం అయిన తర్వాత లీజును మరో 50 ఏళ్లు పొడిగించుకున్నారు. కానీ, ఆ రోజునుంచి ఇవాళ్టి వరకు ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
తమ కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందనుకున్న రైతుల ఆశలు తీరలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘గతంలో నాటు బాంబులు వేసి భయపెట్టారు. ఇష్టం లేకున్నా భూములు అమ్మాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. కోడెల శివప్రసాదును వేధించి చంపేశారు. ఫర్నీచరుపై శివప్రసాదును వేధించిన వ్యక్తి.. ప్లాంట్ పేరుతో భూములు లాక్కొన్నారు. ఉద్యోగాలు ఇస్తాం.. భూములు అమ్మేయండని బలవంతంగా తీసుకున్నారు. మరోచోట 350 ఎకరాలను తీసుకున్నారు. ముడి సరకు కోసం 1100 ఎకరాలు తీసుకున్నారు. ఇక్కడి ప్రజల భూమిని తీసుకొని.. వారినే ఇబ్బందులకు గురి చేశారు’ అని ఉప ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘400 ఎకరాల అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతాం. సరస్వతి పవర్ కింద ఎంత భూమి ఉంది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగాయనే దానిపై విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నా. పెట్టిన ప్రాజెక్టు అసలు ఎందుకు ముందుకెళ్లలేదో తేల్చాలి. కొండలు, చెరువులు.. ఇలా సహజ వనరులున్న మరో 24 ఎకరాలు ఆక్రమించుకున్నారు. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.