- నెలరోజుల్లో పనులు ప్రారంభం
- లంక భూముల సమస్య పరిష్కారం
- కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడి
- రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం
అమరావతి (చైతన్యరథం): రాజధానిలో లంక భూముల సమస్య పరిష్కారమయింనది కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రాయపూడి సీఆర్డీయే కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. త్రిసభ్య కమిటీ సమావేశానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం కేంద్రమంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందన్నారు. ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందని పేర్కొన్నారు. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని చెప్పారు.
భూ సమీకరణ చేయని భూముల్లో ప్లాట్లు పొందిన వారి సమస్య పెండిరగ్‌లో ఉంది. అక్కడ రైతులతో ఎమ్మెల్యే, మంత్రి మాట్లాడాక భూసేకరణకు వెళతాం. వేరే చోట్ల ప్లాట్లు కావాలని అడిగిన వారికి లాటరీ ద్వారా కేటాయించే చర్యలు తీసుకుంటాం. పెద్ద ప్లాట్లు పొందేవారు కొంత సమయం వేచి ఉండాలి. కమర్షియల్ ప్లాట్లలో వాస్తు ప్రకారం ఉండాలని కొందరు అడిగారు. 7 ఎకరాల మేర ప్లాట్లు మార్చాల్సి ఉంటుంది. 26 గ్రామాల్లో అభివృద్ధి పనుల డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. వారంలో డీపీఆర్ లు సిద్ధం చేసి నెలాఖరులోగా పనులు ప్రారంభిస్తాం. సామాజిక అభివృద్ధిలో భాగంగా కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు నిర్మిస్తాం. వీటికి భూమి, నిధులు సమకూరుస్తాం. రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్య పెంచుతామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఆర్ 5 జోన్ పై న్యాయసలహా: మంత్రి నారాయణ
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ మాట్లాడుతూ రౖౖెతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామన్నారు. 700 మంది రైతులకు చెందిన 921 ప్లాట్‌లు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూమిలో వచ్చాయి. అలాంటి రైతులకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నాం. చాలామంది రైతులు ల్యాండ్ అక్విజిషన్ తర్వాత అవే ప్లాట్ లు తీసుకుంటామని చెప్పారు. 37 మంది రైతులు వేరే చోట ప్లాట్ లు కేటాయించమని అడిగారు. జరీబు, గ్రామ కంఠం ప్లాట్ లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటివరకూ 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా కేవలం 7628 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తాం. ఆర్ 5 జోన్ పై న్యాయసలహా తీసుకుంటున్నామని
మంత్రి నారాయణ తెలిపారు.
సోమవారం తరువాత గ్రామాల్లో సమావేశాలు పెట్టి సోషల్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌లపై, గ్రామ అభివృద్ధి ప్లాన్‌లపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తెలిపారు. అసైన్డ్ ల్యాండ్ విషయంలో ఉన్న సమస్యలను కూడా న్యాయపరమైన చిక్కులు తొలిగాకే సరిచేస్తామన్నారు.
పింఛన్లకు చర్యలు
రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్లు ఇవ్వటానికి సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. త్రిసభ్య కమిటీ సమావేశంలో 4,929 మంది పింఛన్ల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు అర్హులైన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వటానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. రాజధానికి భూసమీకరణ జరిగిన సమయంలో భూమి లేని పేదలకు ఉపాధికి ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో 4,929 మంది పేదలు పెన్షన్లు తీసుకునేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు నిలిపివేయటంతో పాటు.. పేదలకు పెన్షన్లు రద్దు చేసింది. ఇప్పుడు వారందరికీ పెన్షన్లు పునరుద్ధ్దరించేందుకు దరఖాస్తులు స్వీకరించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో పెన్షన్ దరఖాస్తులు ఇవ్వాలని కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామసభల సమయంలోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. భూమి లేని పేదలకు న్యాయం చేస్తామన్నారు.















