- అధికారులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపు
- అభివృద్ధిపై శాఖల వారీగా మంత్రి సమీక్ష
పార్వతీపురం (చైతన్యరథం): సమష్టి కృషితో పార్వతీపురం మన్యం జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళదామని జిల్లా అధికారులకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ప్రాంతమని, అధిక శాతం గిరిజనులుండే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్టు చెప్పారు. అందులో భాగంగా ఐటీడీఏలను పునరుద్ధరించి, తద్వారా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఐటీడీఏకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించినట్టు ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లా నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్న జిల్లా యంత్రాంగానికి, అధికారులకు ఆమె అభినందనలు తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో శాఖల వారీగా మంత్రి సంధ్యారాణి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మూతపడ్డ పాఠశాలలు తెరిపించాలి
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు వంటి పలు అంశాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. గత రెండేళ్లుగా 10వ తరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో జిల్లా నిలిచిందని, ఈ ఏడాది కూడా అదేబాటలో నడవాలని ఆమె ఆకాంక్షించారు. ఐఐటి, ఎన్‌ఐఐటి, ఎంబిబిఎస్‌లో జిల్లా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించాలనేది తన తపన అని, ఆ దిశగా విద్యలో పలు మార్పులు రావాలని ఆమె పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో జిల్లాలో 129 పాఠశాలలు మూతపడ్డాయని, వాటిపై సమగ్రమైన సర్వేచేసి అవసరమైన వాటిన పున:ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించాలని అధికారులను అదేశించారు.
ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో పాఠశాలలను తెరవేందుకు కృషి చేస్తామని, పాఠశాలలన్నీ సమయపాలని పాటించాలన్నారు. గతంలో వసతి గృహాల విద్యార్థులకు కాస్మోటిక్స్ ఛార్జీలను తల్లి ఖాతాలో జమచేయడం జరిగేదని, ఈ ప్రభుత్వంలో జీసీసీ ద్వారా నేరుగా విద్యార్థులకు కాస్మోటిక్స్ సామగ్రిని స్వయంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల దుస్తులకు ఉతికేందుకు ప్రతీ పాఠశాలలో ఒక దోభీని ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అందుకోసం మెనూ చార్జీలను కూడా పెంచనున్నట్లు ఆమె వివరించారు. విద్యా విధానంలో సరికొత్త మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా వసతి గృహ విద్యార్థులకు రూ.10 కోట్ల వ్యయంతో బెడ్‌షీట్, దుప్పటి, కంచం, గిన్నె, ట్రంక్ పెట్టె మొదలైన వాటిని పంపిణీ చేసినట్టు చెప్పారు. నవంబర్ 14న ప్రతి పాఠశాలలో పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ప్రతీ 10 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి వుండాలని, వాటిని దృష్టిలో ఉంచుకోని మరుగుదొడ్లు లేని పాఠశాలలను గుర్తించి కొత్తవి నిర్మించాలని ఆదేశించారు.
వైద్యులు, మందులు అందుబాటులో ఉండాలి
గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ప్రాథమిక ఆరోగ్యా కేంద్రానికి తప్పనిసరిగా వైద్యులు ఉండాలని, లేనిలోట వైద్యులను సర్దుబాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి కోరారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులతో పాటు మందులు కూడా అందుబాటులో ఉండాలని, రోగులు బయటకు వెళ్ళి మందులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండరాదని ఆమె సృష్టం చేశారు. జిల్లాలో రక్తహీనత లోపం ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున, రక్తహీనత నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవసరమైన ఎస్.సి.ఎం ఇంజక్షన్ అందుబాటులో ఉంచుకోవాలని, వాటికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజురుచేసేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. సాలూరులో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఇటీవలే ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులను మంజూరు చేసిందని, మిగిలిన పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేసి, ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు ఆమె వివరించారు. కురుపాంలోని ఆసుపత్రికి రూ.40 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని, సంక్రాంతి నాటికి నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధం కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరామని, త్వరలో మంజూరు అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి గ్రామానికీ తాగునీరు అందించాలి
జిల్లాలోని ప్రతీ గ్రామానికి సురక్షిత తాగునీటిని అందించాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికి 85% గ్రామాల్లో పూర్తిగాను, 5% శాతం పాక్షికంగానూ గ్రామాల్లో తాగునీటిని అందిస్తున్నారని, మిగిలిన 10 శాతం గ్రామాల్లో రానున్న 30 రోజుల్లో పనులు పూర్తిచేయాలని అదేశించారు. చెరువుల అనుసంధానంతో జిల్లాలో సాగునీటి సమస్య లేకుండా చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ను ఆమె ఆదేశించారు. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో పంట భూములుండగా, వాటిలో 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామన్నారు. తోటపల్లి జలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కురుపాం నియోజకవర్గంలోని పంట భూములతో పాటు మిగిలిన భూములకు కూడా సాగునీటిని అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ జైకా నిధులతో గతంలో పనులు ప్రారంభించి నిలిచిపోయిన పనులను మరలా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం
మన్యం జిల్లాలో 2,748 గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని, తొలిదశలో 549 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి, దశల వారీగా మిగిలిన పనులను పూర్తిచేయాలన్నారు. గ్రామసభల్లో తీర్మానించిన అన్ని పనులను సంక్రాంతిలోగా పూర్తి చేయాలన్నారు. కుంకీ ఏనుగులతో గ్రామాల్లోని ఏనుగుల సమస్యను పరిష్కరించాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ప్రతి పంచాయతీలో బాల విహార్, యువ కేంద్రాలు చేపట్టాలన్నారు.
ప్రతి మండలంలో అన్న క్యాంటీన్
జిల్లాలోని 2,064 అంగన్వాడీ కేంద్రాలకు గాను 469 కేంద్రాల్లో మరుగుదొడ్ల సదుపాయం లేదని, వెంటనే ఏర్పాటు చేసి, నీటి సదుపాయం కల్పించాలన్నారు. సొంత అంగన్వాడీ భవన నిర్మాణాల కోసం 5 సెంట్ల స్థలాన్ని వీఆర్‌ఓల ద్వారా సేకరించాలని జిల్లా రెవిన్యూ అధికారిని ఆదేశించారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీస్లు ప్రతీ మండలంలో ఏర్పాటు చేయాలన్నారు. సీతంపేట ఐటీడీఏ ఎదురుగా ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్న క్యాంటీన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సమకూర్చాలన్నారు. భారీ వర్షాల సమయంలో రహదారులు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి, వాటి మరమ్మతుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని
ఆమె ఈ సందర్బంగా కోరారు.
తొలుత జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రగతిని, చేపట్టబోయే కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్. శోబిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి జి.కేశవ నాయుడు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సుందర పార్వతిపురం ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి
సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం ప్రారంభించారు. సుందర పార్వతీపురం రూపొందాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై జిల్లా వ్యాప్తంగా పరిశుద్ధ వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటు సుందరమైన ప్రకృతి సోయగాల పరిసరాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.