- ఏపీ మారిటైం బోర్డు నూతన చైర్మన్ దామచర్ల సత్య
- సంస్థ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
- హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో పోర్టులను అభివృద్ధి చేసి తద్వారా మరిన్ని పెట్టుబడులను రప్పించేందుకు కృషి చేస్తానని ఏపీ మారిటైం బోర్డు నూతన చైర్మన్ దామచర్ల సత్యనారాయణ (సత్య) అన్నారు. మంగళగిరిలోని ఐహెచ్‌సీ కార్పొరేట్ భవనంలోని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు కార్యాలయంలో సంస్థ నూతన చైర్మన్‌గా దామచర్ల సత్య శనివారం మధ్యాహ్నం 12:36 నిమిషాలకు కుటుంబసభ్యులతో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనపై నమ్మకం ఉంచి మారిటైం బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పోర్ట్లులు, హార్బర్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తానని తెలియచేశారు. తాను ఈ స్థాయికి ఎదిగేందుకు కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి మరువలేనిదన్నారు. వారి కోసం, కొండపి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.
మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్థన్ రెడ్డి, డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముత్తముల అశోక్ రెడ్డి (గిద్దలూరు), బిఎన్ విజయ్ కుమార్ (సంతనూతలాడు) కార్యాలయంలో దామచర్ల సత్యకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయం వెనుక వైపు ఉన్న రాయల్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన బాధ్యత స్వీకరణోత్సవ సభకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై సత్యకి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా వ్యవహరించిన కారణంగా ఉత్తరాంధ్ర నియోజకవర్గాల శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు హాజరై శుభాకంక్షలు తెలిపారు. సత్య స్థానిక నియోజకవర్గం ప్రకాశం జిల్లా , కొండపి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలపాలి: మంత్రి కొల్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైం బోర్డు కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దామచర్ల సత్యను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ఆత్మీయంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మెరైన్ ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపించే బాధ్యత దామచర్ల సత్య తీసుకోవాలన్నారు. తద్వారా భారీ ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలనీ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.