- పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలు
- అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి
- కొత్తగా ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి
- అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాములను చేయండి
- సంస్థల ప్రతినిధులతో తేనీటి సేవనం ఏర్పాటు చేయండి
- రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేద్దాం
- అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశాలు
మంగళగిరి: రాష్ట్రంలో జంతు ప్రదర్శన శాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశంలో అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఏపీ గౌరవ చైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై పవన్ చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శన శాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు.
పీపీపీ విధానంపై దృష్టిసారించాలి
జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన..ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు (వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్) కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాములను చేయాలని, పరిశ్రమల సీఎస్‌ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శన శాలల అభివృద్ధిలో పాలుపంచుకునేలా చేసేందుకు ఉపముఖ్యమంత్రితో తేనీటి సేవనం (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జంతు ప్రదర్శన శాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి జోన్ల వారీగా జూపార్కుల ఏర్పాటు అంశంపై నివేదిక రూపొందించాలన్నారు. పర్యాటకం, పర్యావరణహిత పర్యాటక అభివృద్ధికి సంబంధించిన నమూనాలపై చర్చించారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేద్దామని చెప్పారు. ఈ సమీక్షలో అటవీశాఖ పీసీసీఎఫ్ (హెచ్‌వోఎఫ్‌ఎఫ్) చిరంజీవి చౌదరి, పర్యాటక శాఖ కమిషనర్ కె.కన్నబాబు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎ.కె.నాయక్, డాక్టర్ శాంతిప్రియ పాండే, శరవణన్, ఎన్.నాగేశ్వరరావు, శ్రీకాంతనాథ్‌రెడ్డి, సి.సెల్వం, మంగమ్మ, ఎన్.నాగరాణి, ఎస్వీ యూనివర్శిటీ వెటర్నరీ డిపార్ట్‌మెంట్ డీన్ కె.వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.