హైదరాబాద్/అమరావతి: విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రయత్నాన్ని మంగళగిరి పోలీసులు అడ్డుకున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు దేవినేని యత్నించారు. ఈ క్రమంలో మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు తెలిపారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే.. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసుల ముందస్తు చర్యలు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌పై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం విదితమే. 2021 అక్టోబరు 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అరాచకమూకలు దాడికి తెగబడ్డాయి. వైసీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ యువనాయకుడు దేవినేని అవినాష్‌ల ఆధ్వర్యంలో వారి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు అప్పట్లో టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా, పోలీసులు కనీసం చట్ట పరిధిలో కూడా వ్యవహరించకుండా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంబించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయే వరకు ఎవరు కూడా ఆ కేసు గురించి పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు.