మైలవరం : మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీమంత్రి దేవినేని ఉమా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓ దశలో పోలీసులకు, దేవినేని ఉమాకు, టిడిపి శ్రేణులకు మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది. చివరికి పోలీసులు దేవినేని ఉమాను అరెస్టు చేసి మైలవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు దేవినేని ఉమా మాట్లాడుతూ వారం నుంచి రైతులు ధాన్యం రాశులను ఆరబోసి, ఆకాశం వైపు చూస్తున్నారని, తుఫాను కారణంగా పంట నాశనమైందన్నారు. మొలకెత్తిన వరిని ఎవరు కొంటారని ప్రశ్నించారు. మార్కెట్ యార్డుకు రంగులు వేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ధ్యానం కొనుగోలు చేయడంలో లేదా అని మండిపడ్డారు. పట్టిసీమ నీరు తగిలితే కృష్ణా డెల్టాలో పంటలు బాగా పండేవని, కానీ, పట్టిసీమకు నేటి పాలకులు బూజు పట్టించారన్నారు. తుఫాను బాధిత రైతులందరికీ న్యాయం జరిగే వరకూ టిడిపి శ్రేణులు పోరాడుతూనే ఉంటాయని, తక్షణం ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
కళ్లు తెరిచి రైతు కష్టాలు చూడండి..తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సోమవారం మైలవరం మార్కెట్ యార్డులో రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న మాజీమంత్రి దేవినేని ఉమా