అమరావతి: విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియా బారిన పడి ఇప్పటి వరకు 9 మంది చనిపోగా..బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీటి సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని..దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు.
9కి చేరిన మృతుల సంఖ్య
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మొగల్రాజపురంలో గల్లా కోటేశ్వరరావు(60) అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో శనివారం మృతి చెందాడు. ఇప్పటికే డయేరియా లక్షణాలతో మొగల్రాజపురం, పాయకాపురంలో ఎనిమిది మంది మృతి చెందారు. విజయవాడ నగరంలో డయేరియా బారిన పడి గత ఐదు రోజుల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. ఒక్క మొగల్రాజపురంలోనే ఇప్పటివరకు ఆరుగురు విరేచనాలతో మృతి చెందారు. పాయకాపురం, అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతాల్లో వారం వ్యవధిలో ఇద్దరు మహిళలు, ఒకబాలుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంత తీవ్రత ఉన్నా. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు పెట్టలేదు. మొగల్రాజపురంలోని సీపీఎం కార్యాలయంలో ఆరు పడకలను ఏర్పాటుచేసి వారి సౌజన్యంతో చికిత్స అందిస్తోంది. దాదాపు 250 మంది రక్తనమూనాలు సేకరించామని చెబుతున్నా… ఇంతవరకు ఒక్కదాని ఫలితమూ ప్రకటించలేదు.