అమరావతి (చైతన్యరథం): రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ బోరుగడ్డ అనిల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరగగా.. బోరుగడ్డకు నేరచరిత్ర ఉందని, రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. రెండు కేసుల్లో ఇప్పటికే అతడిపై చార్జిషీట్ దాఖలైందని చెప్పారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ నిందితుడి తరఫు లాయర్‌ను ప్రశ్నించారు. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని, ముందస్తు బెయిల్ ఇవ్వలేమని జడ్జి వ్యాఖ్యానించారు. బోరుగడ్డ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. గత ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ ఐదేళ్లపాటు అరాచకంగా ప్రవర్తించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన రాందాస్ అథవాలె అనుచరుడినని చెప్పుకుంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యాడన్నారు. మాజీ సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలతో అంటకాగుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇతర నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టాడని వివరించారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో బోరుగడ్డ అనిల్ అరాచకానికి హద్దే లేకుండా పోయింది. పోలీసులు సైతం అతనివైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. గుంటూరు నగరానికి చెందిన అనిల్.. జగన్‌ను అన్నా అని సంబోధిస్తూ తానూ పులివెందులకు చెందినవాడినేనంటూ వైసీపీతో అంటకాగాడు. జగన్‌కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు, ప్రతిపక్షనేతలపై సభ్యసమాజం తలదించుకునేలా సామాజిక మాధ్యమాలు, టీవీ డిబేట్లలో ఇష్టానుసారం దూషణలు చేశాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవాడు. జగన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. ప్రతిపక్షాలకు చెందిన మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడి దూషించేవాడు. అప్పట్లో జగన్ పేరు చెప్పి గుంటూరు నగరంలో దందాలు, దౌర్జన్యాలతో హల్‌చల్ చేశాడు. నాడు అధికార పార్టీ వైసీపీ అండదండలు ఉండటంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. జగన్ పేరు చెబుతుండటంతో పోలీసులు సైతం అతని వైపు కన్నెత్తి చూడలేదు..