- రాష్ట్రం పరువు తీస్తున్న ఎంపీలు
- గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం
- సాలూరు శంఖారావం సభలో లోకేష్
సాలూరు: వైసీపీ ఎంపీలు ఏరోజైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని అడిగారా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. పైపెచ్చు రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. సాలూరులో బుధవారం జరిగిన శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ 25కు 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నారు.. మొత్తం వైసీపీకి 31 మంది ఎంపీలు ఉంటే ఏం పీకారని ధ్వజమెత్తారు. ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగలేదు. పైగా కేంద్రంలో వైకాపా ఎంపీలు మన పరువు తీశారు. ఒక ఎంపీనేమో జిప్పులు విప్పదీసి అన్నీ చూపిస్తాడు, మరోఎంపీ బాబాయిని లేపేసిన వ్యక్తి.. సీబీఐ అరెస్ట్ చేసేందుకు వస్తే కర్నూలు ఆసుపత్రిలో దాక్కుంటాడు.
ఓ ఎంపీ టిక్ టాక్, యూట్యూబ్ రీల్స్‌లో బిజీగా ఉంటాడు. ఓ ఎంపీ భార్య, కొడుకుని కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాద్ లో బతికే పరిస్థితి. ఇంకో పిల్లిగడ్డం ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నాడు. జగన్ కేసుల్లో ఏ-2. జగన్ చేసిన అవినీతి లెక్కలన్నీ పుస్తకంలో రాసుకోవడం ఆయన పని. అన్ని అవినీతి వ్యవహారాల్లో తన వాటా ఉందా అని చూసు కుంటాడు. ఆయన విశాఖపట్నంపై పడి పందికొక్కులా గా భూములు లాక్కున్నాడు. ప్రధాని దగ్గరకు వెళ్లి హోదా అడగలేదు..వాళ్లను జైలుకు పంపవద్దని వేడు కుంటాడు. ఒక్క ఎంపీ అయినా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని లోకేష్ ప్రశ్నించారు.
రిమోట్ కంట్రోల్ ఎమ్మెల్యే
సాలూరులో గెలవకపోయినా టీడీపీ హయాంలో సాలూరును అభివృద్ధి చేశాం. హైవే కనెక్టివిటీ తీసుకువచ్చాం. ఓవర్ బ్రిడ్జిలు, బైపాస్ లు కూడా నిర్మించాం. జిగిరాం జూట్ మిల్ ను మనం తీసుకువస్తే ఇప్పుడు మూసేశారు. బీటీ, సీసీ రోడ్లు, డ్రైయిన్లు వేసింది టీడీపీ ప్రభుత్వం. సాలూరు పట్టణంలో నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించాం. అవి కూడా ఇవ్వలేని స్థితిలో వైకాపా ఉంది. 100 పడకల ఆసుపత్రికి నిధులు కేటాయిస్తే వైకాపా వచ్చిన తర్వాత వదిలేశారు. రాజన్న దొరని 4 సార్లు గెలిపించారు. ఉపముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఎలా అభివృద్ధి చేయాలి? ఆయన వద్ద ఇంకులేని పెన్ను ఉంది. కానీ ఇంకు చిన్న శీను దగ్గర ఉంటుంది. ఆయన ఇంకు పోస్తేనే ఈ పెన్ను రాస్తుంది. రిమోట్ కంట్రోల్ ఎమ్మెల్యే. చిన్న శ్రీను వద్ద రిమోట్ ఉంటుంది. లెఫ్ట్ తిరగమంటే లెఫ్ట్, రైట్ తిరగమంటే రైట్ తిరుగుతారు.
అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం
ఉపముఖ్యమంత్రి అయినా మన జీవితాల్లో మార్పు వచ్చిందా? ఒకసారి కోర్టు ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. పెద్ద ఎత్తున భూకబ్జాలు చేసి బినామీ పేర్లపై పెట్టారు. గిరిజనుల సమస్యలను ఒక్కటి కూడా పరిష్కరించలేక పోతున్నారు. 2024లో టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. రెండేళ్లలో 100పడకల ఆసుపత్రిని పూర్తిచేస్తాం. యుద్ధ ప్రాతి పదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం.
ఐటీడీఏలకి తగిన నిధులు ఇచ్చి తండాల్లో ఇళ్లు నిర్మిస్తాం. ఇక్కడ లారీ బిజినెస్ పై చాలా మంది ఆధారపడిఉన్నారు. లారీ డ్రైవర్,ఓనర్లును కలిశా. వారిపైనా బాదుడే బాదుడే. రెండు నెలలు ఓపిక పడితే దేశంలోనే అతి తక్కువ పన్ను వేసే బాధ్యత తీసుకుంటాం. మూతపడిన జూట్ మిల్లు తెరిపించే బాధ్యత మేం తీసుకుంటాం. కియా మాదిరిగా ఉత్తరాంధ్రకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువస్తాం. సెజ్ ఏర్పాటుచేసి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. జీవో 3 పునరుద్ధరిస్తాం. గిరిజనులకు ఆగిపోయిన 17 సంక్షేమ కార్యక్రమాలు పునురుద్ధరిస్తాం. రాష్టవ్యాప్తంగా ఎస్టీ నియోజకవర్గాల్లో 7కు 7 టీడీపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని లోకేష్ అన్నారు.