అమరావతి (చైతన్యరథం): వైకాపా ఎమ్మెల్యేలు దొంగచాటుగా రిజిస్టర్‌లో సంతకాలు చేస్తూ సభకు మాత్రం డుమ్మా కొడుతున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తప్పుబట్టారు. వైకాపా ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్ గురువారం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరెవరైనా చూశారా.. అంటూ సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా అసెంబ్లీకి హాజరు కావాల్సి ఉందన్నారు. వైకాపా సభ్యులు ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు. అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు. వైకాపా సభ్యులు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, తదితరులు సంతకాలు చేసినట్లు తేలిందని స్పీకర్ చెప్పారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వీరెవరూ సభకు హాజరు కాలేదన్నారు. వేర్వేరు తేదీల్లో వీరు రిజిస్టర్లో సంతకాలు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. హాజరుపట్టిలో వారి సంతకాలు ఉన్నా వాళ్లు సభకు వచ్చినట్టు స్పీకర్‌గా తాను గుర్తించలేదన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు తలవంపులు తేవొద్దంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.