అమరావతి: గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ ఎస్టీ నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం ధారునాయక్, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు (ఏజెన్సీ) దొన్నుదొర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య మంగళవారం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. జగన్ ప్రభుత్వం నిలిపివేసిన 16 గిరిజన సంక్షేమ పథకాలు పున:ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గిరిజన బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో గత నాలుగున్నరేళ్లుగా గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. గిరిజనులపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం గిరిజనులకు ప్రసాదించిన హక్కులు కాలరాయబడుతున్నాయి. గిరిజనులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గిరిజనులకు మాత్రమే కల్పించే జీవో నెం.3 ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే పక్క రాష్ట్ర ప్రభుత్వాలు అప్పీల్ చేయగా, వైకాపా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. గిరిజనులకు రాజ్యాంగబద్దంగా అమలు కావాల్సిన సంక్షేమ పధకాలు అమలు కావడం లేదు. దాదాపు 16 గిరిజన సంక్షేమ పథకాలను వైకాపా రద్దు చేసింది. రాష్ట్రంలో అనేక గ్రామాలలో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక గిరిజనులు ప్రక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు.
రాష్ట్రంలో గిరిజనులపై జరిగిన కొన్ని దాడులు..
కృష్ణాజిల్లాలో మోపిదేవి మండలం కే కొత్తపాళెం గ్రామంలో ముగ్గురు యానాది మహిళలపై దాడులకు పాల్పడ్డారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో గిరిజన యువకుడు నవీన్‌పై దాడి చేసి నోట్లో మూత్ర విసర్జన చేశారు.
కర్నూలులో భర్త కళ్లెదుటే గిరిజన ఆడబిడ్డపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురం తండాలో రమావత్ మంత్రీబాయిని వైసీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్ తొక్కించి హత్య చేశాడు.
గుంటూరు జిల్లా, వినుకొండ మండలం, గరికపాడు లో సాంబశివరావు మూడావత్ అనే గిరిజనుడిపై అక్రమ కేసు బనాయించారు.
కృష్ణా జిల్లా గంపలగూడెం లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని బాణావత్ లక్ష్మణరావుపై అక్రమ కేసు పెట్టారు.
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి తండా లో ముదావత్ శివ పై దాడి చేశారు.
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లిలో కేతావత్ శంకురబాయిను వేదింపులకు గురిచేశారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో యానాది కులానికి చెందిన ఈగ మహేష్‌పై దాడి చేసారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, గంగవరంలో కొండకాపు కులానికి చెందిన కనిగిరి రాజబాబుపై దాడి చేశారు.
ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెవ నియోజకవర్గం డోర్నాల మండలం బోడేనాయక్ తండా, బొమ్మలపురంలో దేశావత్ కృష్ణ నాయక్ భూమిని కబ్జా చేశారు.
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రామస్వామి తండాలో హేమలతా బాయిని ఉద్యోగం నుంచి తొలగించి వేధించారు.
ప్రకాశం జిల్లా, లింగసముద్రం మండలం ఎంగలపురంలో జగన్నాదం సురేష్ అనే గిరిజనుడిని వేధింపులకు గురిచేశారు.
కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గం కె.కొండూరులో భూక్యా కృష్ణ ను వేధింపులకు గురిచేశారు.
తమ విజ్ఞప్తిని పరగణలోకి తీసుకుని గిరిజనులపై జరుగుతున్న దాడులను నిరోధించేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్‌ను టీడీపీ నాయకులు కోరారు.