అమరావతి (చైతన్యరథం): అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పింఛన్‌ను రూ. 6 వేల రూపాయలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులు తనను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందించారన్నారు. వారి కోరికపై తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చానన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేసాం. దివ్యాంగుల కోసం టీడీపీ అమలుచేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు.