అమరావతి: ఏపీ చరిత్రలో సోమవారం రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఒకే ఒక్క రోజులో 95.02 శాతం మేర లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేసి సరికొత్త ఒరవడిని సృష్టించింది. రాత్రి 7గంటల సమయానికి మొత్తం 65,18, 496 లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా 61,93,115 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడిరచారు. లబ్ధిదారులకు రూ.4,180 కోట్ల మేర నగదు అందజేశారు. విజయనగరం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 97 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91 శాతం మందికి పెన్షన్లు ఇచ్చారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పింఛన్ల పంపిణీ.. కూటమి ప్రభుత్వం సారథ్యంలో 1.30 లక్షల మంది సచివాలయాల ఉద్యోగులతో 12 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం విశేషం. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో క్రియాశీలంగా పాల్గొన్న అధికారుల నుంచి గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగుల వరకు అందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.