అమరావతి: ఒకటి, రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో డోలా సమీక్షించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలని సూచించారు. ఊరికి దూరంగా కట్టిన సచివాలయాల మీద నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాలు, పంచాయతీల మధ్య సమన్వయ లోపాన్ని సవరించాలని అన్నారు.
వారిపై చర్యలు తీసుకోవాలి..
జూలై ఒకటోతేదీన పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదు. సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు లక్షా 9వేల మంది వలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసి కూడా సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేయని వారి సంగతేంటి.. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. చాలాచోట్ల గ్రామ, వార్డు సచివాలయ భవనాలు ఊరికి దూరంగా, ప్రజలకు ఏవిధంగానూ అందుబాటులో లేకుండా ఉన్నాయి. అవన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. అలాంటి వాటిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సెలవుల మంజూరుపై ఒక కచ్చితమైన విధానాన్ని రూపొందించాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
పాత లోగోలు ఉండొద్దు..
సచివాలయాలు జారీ చేసే సర్టిఫికెట్లు, ఇతర సర్వీసు పత్రాలపై పాత లోగోలు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో ఎక్కడైనా అలసత్వం వహించినట్లు తెలిస్తే చర్యలు తప్పవు. సచివాలయ భవనాల మీద రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఉంచాలి. రాష్ట్రంలో చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు, పంచాయతీలకు మధ్య సమన్వయం లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఇతర శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులను సైతం సంప్రదించి అవసరమైతే ఒక కమిటీ వేసుకుని సమన్వయాన్ని సాధించాలి. గ్రామ, వార్డు సచివాలయాల రోజు వారి వ్యవహారాలను పరిశీలించేలా మండల స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలి. రక్త హీనత, ఆహార లోపం, బడి బయటి పిల్లలు, పాఠశాలల్లో మౌలిక వసతులు వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు