అమరావతి: ఒక ఆలోచన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తే, మరొక ఆలోచన తిరోగమనం వైపు దారిమళ్ళించింది. చంద్రబాబు, జగన్ ఆలోచనల్లో ఎంతో వ్యత్యాసముంది. వారిరువురినీ ఒకరితో మరొకరిని పోల్చడం సమంజసం కాదు. అయినా ఇద్దరి ఆలోచనా సరళి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాభివృద్ధి ధ్యాసలో నిమగ్నమైన చంద్రబాబు తాను చేసింది చెప్పుకోలేక పోయారు. అదే సమయంలో ప్రజలను మభ్యపెట్టే వాగ్దానాలు చేయడంపైనే జగన్ సమయమంతా కేటాయించారు. ఆ పొరపాటు రాష్ట్రానికే కాక, భావితరాల భవిష్యత్‌కు శాపంగా మారింది. చంద్రబాబు ఆలోచన సంపద సృష్టికి దారితీసి రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపింది. జగన్ యోచన ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమై, విధ్వంసకర పాలన దిశగా సాగింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. చివరకు ఉద్యోగుల వేతనాలు సైతం రుణం దొరికితేనే ఇచ్చే పరిస్థితి వుంది. చంద్రబాబు ఆలోచన ప్రజల జీవన ప్రమాణాలలో మార్పునకు దోహదపడిరది. జగన్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఇసుక విధానం, నిర్మాణరంగంపై కారుమబ్బులు కమ్మేలా చేసింది. పొట్ట చేతబట్టుకొని వలసపోతున్న కార్మికుల దుస్థితి ఇప్పటికీ కళ్లముందే కదలాడుతోంది. ‘అన్న’ క్యాంటీన్ల ఏర్పాటుతో అన్నార్తుల ఆకలి తీర్చే యోచన చంద్రబాబుదైతే, వాటిని మూసివేయించే కక్షపూరిత ఆలోచన జగన్‌ది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌లు, పరిశ్రమలు చంద్రబాబు హయాంలో పురుడు పోసుకున్నాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల కారణంగా పారిశ్రామికవేత్తలు పరారయ్యే పరిస్థితి జగన్ పాలనలో నెలకొంది.