టిడిపి అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు కార్పొరేషన్ కు నిధులిచ్చి బలోపేతం చేస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాల ఫైర్ స్టేషన్ వద్ద రాయలసీమ దివ్యాంగుల సేవాసమితి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిరుపేద దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలి. దివ్యాంగత్వ శాతాన్ని బట్టి పెన్షన్ పెంచాలి. శారీరక దివ్యాంగులకు ఉద్యోగ రిజర్వేషన్ శాతం పెంచాలి. వైసీపీ పాలనలో దివ్యాంగులకు ఎటువంటి సహాయ,సహకారాలు అందడం లేదు. దివ్యాంగుల వివాహాలకు ఎటువంటి ఆర్థికసాయం అందడం లేదు.
త్రీవీలర్ మోటార్ సైకిల్స్ రావడం లేదు. 45ఏళ్లు లోపు వారికే అని నిబంధనలు పెట్టారు. వైసీపీ పాలనలో దివ్యాంగులకు పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దివ్యాంగుల కార్పొరేషన్ కు డైరెక్టర్లను నియమించలేదు. వైసీపీ పాలనలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీని నిలిపేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించండి. అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగులపై సానుభూతి చూపాల్సిన ముఖ్యమంత్రి కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.6,500 కోట్లు ఖర్చుచేశాం. టీడీపీ హయాంలో దివ్యాంగులకు పార్లమెంట్ నిధుల నుండి బ్యాటరీ సైకిళ్లను ప్రతి పార్లమెంటు పరిధిలో పంపిణీ చేశాం. వయస్సుతో సంబంధం లేకుండా త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందించాం. అవసరమైన వారందరికీ కృత్రిమ అవయవాలు పంపిణీచేస్తాం. ఇళ్లు లేని వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు.