మచిలీపట్నం (చైతన్యరథం): అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ భవనాలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాల నిర్మాణానికి జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధులను (డీఎంఎఫ్) తొలి ప్రాధాన్యతగా వినియోగించాలని అధికారులను రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. సోమవారం సాయంత్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి జిల్లాలోని శాసనసభ్యులతో డీఎంఎఫ్ నిధుల వినియోగంపై మంత్రి కొల్లు సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో డీఎంఎఫ్ నిధులు 20 కోట్ల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయని ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సిఉందని మంత్రికి వివరించారు. ముఖ్యంగా 55 శాతం నిధులు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గనులు సంబంధ వ్యాధుల చికిత్స కోసం, బీమా పథకాల కోసం, పాఠశాల భవనాలు, ప్రయోగశాలలు, గ్రంధాలయాలు, మరుగుదొడ్లు, వసతి గృహాలు, నైపుణ్య కేంద్రాలు, తదితర వసతుల ఏర్పాటు కోసం ఖర్చు చేయవచ్చన్నారు.
అలాగే 40 శాతం నిధులను రహదారులు, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర వసతుల కల్పనకు వినియోగించవచ్చన్నారు. మిగిలిన 5 శాతం నిధులను గనులు, భూగర్భ శాఖ పరిపాలన ఖర్చులకు వినియోగించుకోవచ్చన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్, అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కొంత మేర డీఎంఎఫ్ నిధులు కేటాయించాలని కలెక్టర్‌కు సూచించారు. మండలాల వారీగా అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వసతి గృహాలు, తదితర భవనాల జాబితా సేకరించి వాటిని పూర్తి చేసేందుకు నిధులను వినియోగించాలని సూచించారు. ఇందుకోసం శాసనసభ్యులు వారి పరిధిలో అవసరమైన భవనాల పూర్తికి ప్రతిపాదనలు పంపాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలకు కూడా ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మచిలీపట్నంలో మంచినీటి సౌకర్యానికి అవసరమైన ఫిల్టర్ బెడ్లు ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన నియోజకవర్గాల శాసనసభ్యులు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణ రావు, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్, బీసీ సంక్షేమ అధికారి జి రమేష్, గనుల శాఖ టెక్నీషియన్ శంకర్, తదితర అధికారులు పాల్గొన్నారు.