అమరావతి: రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ కు విజ్జప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కు లోకేష్ ఒక లేఖరాశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఏ తేదీల్లో ఏఏ ప్రాజెక్టులను ప్రారంభిస్తారో అప్పటి జలవనరుల మంత్రి అసెంబ్లీ సాక్షిగా బల్లగుద్దీ మరీ ప్రకటించారు. మంత్రి గారి ప్రకటించి నేటికీ 34 నెలలైంది. ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. మా ఐదేళ్ల పాలనలో రూ. 68,293 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టుల పనులు చేపట్టాం. 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టుకు నీరందించమన్నారు. రికార్డు స్థాయిలో 3,348 కాస్కేడ్లు అభివృద్ధి చేసి 4,735 చెరువులకు అనుసంధానించాం. 93,308 చెక్ డ్యాములు, 27,866 ఊట చెరువులు, 8.4 లక్షల పంట కుంటలతో భూగర్భజలాలు పెరిగేందుకు కృషి చేశాం. తాగునీటికి కటకటలాడే రాయలసీమకి సాగునీరు అందించమన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో జలజగడం సృష్టించి వేడుక చూస్తున్నారు. తెలంగాణలోని ఆస్తులు,కేసుల్నించి రక్షణకి ఏపీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం దారుణం. ప్రతిపక్షనేతగా కాళేశ్వరం ద్వారా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని దీక్షలు చేసిన మీరు, సీఎం అయ్యాక అదే ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్లడం రాయల సీమ ప్రజలకు చేసిన ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. టిడిపి ఏడాదికి రూ.13,600 కోట్లు జలవనరులపై ప్రాజెక్టులపై ఖర్చుచేస్తే, మీరు ఏడాదికి రూ.5,844.77 కోట్లు వెచ్చించి ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారు. టిడిపి సర్కారు ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి రూ.10,747.67 కోట్లు ఖర్చు చేస్తే, మీ పాలనలో కేవలం రూ.2,737.42 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని గతేడాది నవంబర్ అసెంబ్లీ లో సమాధానం ఇచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5,738.1 కోట్లు ఖర్చు చేస్తే మీరు కేవలం రూ రూ.504.31 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీనికోసం జీవో నెం.30 ద్వారా రూ.1977 కోట్లు అంచనాలు కూడా పెంచుకున్నారు. గాలేరు – నగరి సుజల స్రవంతికి టీడీపీ హయాంలో రూ.2,394.88 కోట్లు ఖర్చు చేస్తే మీరు కేవలం రూ.759.99 కోట్లు మాత్రమే ఖర్చు చేశా రు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు. వంశ ధార, మహేంద్ర తనయ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. ప్రకాశం జిల్లా వరప్రదాయిని వెలిగొండ అనుమతులు లేని ప్రాజెక్టుగా కేంద్రం గజిట్ లో పేర్కొన్నా ప్రశ్నించలేని దయనీయస్థితిలో మీరున్నారు. సమా చారం హక్కు చట్టం ప్రకారం టిడిపి హయాంలో మొదటి టన్నెల్ 99.45 శాతం, రెండో టన్నెల్ 60.91శాతం పనులు పూర్తయితే, మీరే ఈ పనులు చేసినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు.
కొత్త, పాత ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్లు అవసరం కాగా, మీరు నిధులు కేటాయించ కపోవడంతో ఈ ప్రాజెక్టుల పూర్తి అగమ్యగోచరంగా తయారైంది. మా పాలనలో పూర్తయి, మిగిలిన చిన్న పనులు చేస్తే ప్రారంభించాల్సిన నెల్లూరు, సంగం బ్యారేజీలని ఇప్పటివరకూ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నిస్తున్నాను. తన నియోజకవర్గమైన కుప్పం కంటే ముందుగా పులివెందులకి నీళ్లిచ్చిన ఘనత మా అధినేత చంద్రబాబు గారిది. కుప్పంకి నీరు వెళ్లకుం డా అడ్డుకున్న దుష్టబుద్ధి మీది. కొత్త ప్రాజెక్టులు ఎలాగూ కట్టలేరు, కనీసం ఉన్న ప్రాజెక్టుల మరమ్మత్తులు చేయించలేని నిస్సహాయ ప్రభుత్వంతో రైతాంగం తీవ్రంగా నష్ట పోతోంది. ప్రకాశం బ్యారేజీ గేటు, పులిచింతల గేటు, గుండ్లకమ్మ ప్రాజెక్టు 3వ గేటు కొట్టుకుపోయి టీఎంసీలు నీరు వృధా అయ్యింది. గేట్లు బిగించలేని అసమర్థ సర్కా రు వల్లే,అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి 62మంది మృత్యువాత పడ్డారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. కమీషన్లు పిండు కోవడం ఆపి, జలవనరుల ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.