- తీర్పును 27కి వాయిదా వేసిన నాంపల్లి సీబీఐ కోర్టు
హైదరాబాద్: విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసుకున్న అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పిటిషన్ వేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో 20 రోజుల పాటు కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. లండన్‌లో ఉన్న కూతురుని చూడటానికి వెళ్లాలని, అనుమతి ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. విదేశీ పర్యటనకు జగన్ అనుమతి కోరటం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. ఏపీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత 15 రోజులు పాటు జగన్ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
తిరిగి ఇప్పుడు మరోసారి విదేశాలకు వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా… అనుమతి ఇవ్వదంటూ సీబీఐ బుధవారం కౌంటర్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు సంబంధించి ఇరువురి వాదనలు పూర్తి అవగా.. తీర్పును ఈనెల 27న వెల్లడిస్తామన్న సీబీఐ కోర్టు తెలిపింది. అలాగే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 30న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడిరచనుంది.