- ఏ విషయంపైనా తొందరపడి మాట్లాడొద్దు
- కొత్త మంత్రులు శాఖలపై పట్టు సాధించాలి
అమరావతి: ఉచిత ఇసుక రీచుల విధానంలో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం కేబినెట్ భేటీ ముగిశాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని వివరించారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డంప్ యార్డుల్లో ఉందన్నారు. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం. నదుల్లో పూడికతీత, బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక వస్తుంది. లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలి. శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతినెలా సమీక్ష చేయాలి. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలి. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు మంచి చేయాలనే ఢల్లీి వెళ్తున్నామని చంద్రబాబు వెల్లడిరచారు.
ఈ నెల 22వ తేదీ నుంచి 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతాం. ఈ చట్టం ఎంత ప్రమాదకరమో అనే విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలి. పంటల బీమా పథకం పకడ్బందీ అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తాం. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసింది. ధాన్యం సేకరణపై కూడా చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు.
గనులు, భూ కబ్జాలపై..
గనులు, భూకబ్జా అంశంపై కమిటీ వేయాలని ఆలోచిస్తున్నాం. ఏ విషయంపై తొందరపడి మాట్లాడొద్దు. కాకినాడలో ద్వారంపూడి కుటుంబం బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, కొడుకు ఎమ్మెల్యే, మరో కుమారుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్. ముగ్గురూ కలిసి రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి కిలో రూ.43కు ఎగుమతి చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. వచ్చే మంత్రివర్గం సమావేశం వరకు ఏం చేద్దాం అనే దానిపై విధి విధానాలతో రావాలి. సీనియర్ మంత్రులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేను ఇప్పటికీ కొత్త విషయాలు నేర్చుకుంటా. నాకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారు, సబ్జెక్ట్ పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు శాఖలపైనా, మిగిలిన విషయాలపైనా అవగాహన పెంచుకోవాలి. ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు, అందుకు తగ్గట్టు మనం పనిచేయాలి. ఆగస్టు 1వ తేదీన ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీలో పాల్గొందామని సీఎం చంద్రబాబు చెప్పారు.