- రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
అమరావతి: పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 27వవార్డు ఉల్లాసపేట (శ్రీనివాసనగర్) సర్వేనెం.306లో గత నలభై ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్ల విషయంలో జోక్యం చేసుకోవడం గానీ, కూల్చ డం గానీ చేయరాదని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై రెండువారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ తరపున న్యాయవాదులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది బాధితుల తర పున హైకోర్టు న్యాయవాదులు మెండా లక్ష్మీనారాయణ, గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు విన్పిస్తూ 2000వ సంవత్సరంలో ఉల్లాసపేటలో పేదలకు ప్రభుత్వం పట్టా లివ్వగా, అక్కడ పేదలు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారని తెలిపారు. అయితే ముందస్తు నోటీసులు లేకుండా ఈనెల 18వ రాత్రి అకస్మాత్తులు మున్సిపల్, రెవిన్యూ, పోలీసు అధికారులు పొక్లయినర్లతో వచ్చి ఇళ్లను కూలగొట్టే ప్రయ త్నం చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందిస్తూ సంబంధిత ఇళ్ల విషయంలో జోక్యం చేసుకోవడం గానీ, కూల్చివేయడం కానీ చేయవద్దని మున్సిపల్, రెవిన్యూ, పోలీసు అధికారులను ఆదేశించింది.
అసలేం జరిగింది
శ్రీకాకుళం జిల్లా పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 27వ వార్డు ఉల్లాసపేట (శ్రీనివాస నగర్) లోని ఖాళీ స్థలంలో గత 40సంవత్సరాలు పేదలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉన్న పేదలకు 2000వ సంవ త్సరంలో టిడిపి ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇవ్వగా, పేదలు అక్కడ ఇళ్ళు నిర్మించుకొని నివాసముంటున్నారు. ఈ ఇళ్లకు విద్యుత్ కనెన్షన్, ఆస్తిపన్ను వంటివి కూడా గత 20సంవత్సరాలుగా చెల్లిస్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా స్థానికంగా వైసిపి నేతలు చేస్తున్న భూకబ్జాలను ప్రశ్నించిన ఆ వార్డు టీడీపీ కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణపై మున్సిపల్, రెవిన్యూ అధికారులు వేధింపులకు దిగారు. వైసిపి నేతలు రాజకీయ కక్షతో ఈనెల 18వతేదీ రాత్రి అకస్మాత్తుగా సూర్యనారాయణ ఇంటితోపాటు పేదలు ఏళ్లతరబడి నివసిస్తున్న ఇళ్లపైకి జెసిబిని పంపి కూలగొట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఇచ్చాపురం శాసనసభ్యుడు బెందాళం అశోక్ హుటాహుటిన అక్కడికి చేరుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపులకు గురైన కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శిం చేందుకు లోకేష్ ఆదివారం ఉదయం పలాస బయలుదేరగా, తీవ్ర ఆందోళనకు గురైన వైసిపి ప్రభు త్వం దారిలోనే లోకేష్ ను అడ్డగించి అరెస్ట్ చేయించింది. మునిసిపల్, రెవిన్యూ, పోలీస్ అధికారులు అధికార పార్టీ కి కొమ్ము కాస్తూ పేదల ఇళ్లు కూల్చడానికి ప్రయత్నిస్తే ఎమ్మెల్యే బెందాళం అశోక్ పేద ప్రజల పక్షాన, న్యాయం వైపున నిలబడటమే నేరమా అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.