- బీసీలకు జోగి రమేష్ చేసిన మేలేమిటి?
- కొడుకు అరెస్టయితే బీసీ కార్డు వాడుకోవడానికి సిగ్గుండాలి
- మంత్రి పదవికోసం నాడు చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి
- రెడ్‌బుక్ తెరవక ముందే అండర్ గ్రౌండ్లోకి వైసీపీ నేతలు
అమరావతి(చైతన్యరథం): అక్రమంగా అగ్రిగోల్డ్ భూములను కొట్టేసి అమ్ముకున్న మోసగాడిని చట్టపరంగా అరెస్ట్ చేస్తే జోగి రమేష్ గగ్గోలు పెడుతూ బీసీ కార్డు వాడుతున్నాడని, జోగికి గత ఐదేళ్లు గుర్తుకు రాని బీసీలు కొడుకు అరెస్ట్ అయ్యేసరికి గుర్తుకొచ్చారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. బీసీలకు కాదు కదా సొంత కులస్తులైన కల్లుగీత కార్మికులకు కూడా జోగి రమేష్ చేసిన మేలు ఒక్కటి కూడా లేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ అవినీతి, ఫ్యాక్షనిజం, గంజాయి గురించి ప్రశ్నిస్తారనే అసెంబ్లీకి రాకుండా వైసీనీ నేతలు మొఖం చాటేశారని విమర్శించారు. కృష్ణా జిల్లాలో జోగి రమేష్ అరాచకాలు నేడు బయట పడి, ఆయన కొడుకు అరెస్ట్ అయ్యాడు. 2019లో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని వైసీపీ నేతలు ఇంటింటికి తిరిగి భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చాక సీఐడీ పరిధిలో ఉన్న భూములను కూడా వదలకుండా కొట్టేశారు. విజయవాడ అంబాపురంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి రాజీవ్, జోగి వెంటేశ్వరరావులు అక్రమంగా కొట్టేసి. సర్వే నెంబర్లు, రికార్డులను మార్చారు. మళ్లీ ఆ భూములను అక్రమంగా విక్రయాలు జరిపారు. గ్రామ సర్వేయర్ సర్వే చేయకపోయినా సర్వే చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి అగ్రిగోల్డ్ భూములను కొట్టేశారని మంత్రి సుభాష్ విమర్శించారు.
బీసీలకు అన్యాయంపై ఏనాడైనా నోరెత్తారా?
జోగి రమేష్‌కు అసలు సిగ్గుందా? గత ఐదేళ్లలో బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏనాడైనా నోరెత్తారా? బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. సొంత కులస్తులైన గీత కార్మికులకు కూడా జోగి రమేష్ చేసిన మేలు ఏమీ లేదు. జోగి సొంత కులస్తుడు అమర్నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగలబెడితే ఒక్క మాట మాట్లాడలేదు. జోగి రమేష్ నేడు తన కొడుకు కేసుల్లో ఇరుక్కోవడంతో కులం కార్డు వాడుకుంటున్నాడు. జగన్ మెప్పుకోసం గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసి మంత్రి పదవి పొందాడు. పేర్ని నాని, కొడాలి నానిలు లోకేష్, చంద్రబాబులను తిడతారనే వారికి, సంబరాల రాంబాబుల సరసాలు చూసి జగన్ మంత్రి పదవులు ఇచ్చాడు. దాడులు చేసి, బూతులు తిట్టేవాళ్లకే జగన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చాడని మంత్రి సుభాష్ దుయ్యబట్టారు.
జోగి బీసీ కార్డు వాడటం మానుకోవాలి
నేడు ఈ బూతుల మంత్రులందరూ అజ్ఞాతంలోకి వెళ్లారు. పెడన ప్రజలు తరిమేస్తే..పెనమలూరుకు వచ్చిన జోగికి అక్కడి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. జోగిలాంటి నాయకులు కులం కార్డులు వాడుకోవడం సిగ్గుచేటు. వైసీపీ నేతల్లా అక్రమ కేసులు బనాయించే ప్రభుత్వం కాదు మాది. క్షుణంగా పరిశీలించి సర్వేలు చేసిన తరువాతే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు చేపట్టింది. రెడ్ బుక్ తెరవకుండానే వైసీపీ అవినీతి పరులు లోపలకు పోతారు. ఇప్పటికే వైసీపీ నేతలకు భయంతో తిండి సహించటంలేదు. పేర్ని నానికి మతి భ్రమించి పిచ్చివాగుడు వాగుతున్నాడు. అధికార దుర్వినియోగం చేసి అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేసిన జోగి బీసీ కార్డు వాడుకోవడం మనాలి. బీసీల గౌరవాన్ని నిలబెట్టాలని మంత్రి సుభాష్ హితవు పలికారు.