- 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,48,149 మంది విద్యార్థులకు పౌష్టికాహారం
- సీఎస్ విజయానంద్ వెల్లడి
కర్నూలు (చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ అమలు చేస్తూ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ తెలిపారు. కర్నూలు బి.క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం సీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కార్యక్రమంలో తాను భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వ తరగతి వరకు అమలు చేసిందన్నారు. ఇకనుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలు అవుతోందన్నారు..ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.28 కోట్ల రూపాయలను, వచ్చే ఆర్థిక విద్యా సంవత్సరం నుండి 86 కోట్ల రూపాయలను ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే 1,63,750 మంది విద్యార్థినీ, విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి లోకేష్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని సీఎస్ తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా మేధో శక్తి, శారీరక బలంతో పాటు మానసిక వికాసం కలిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలో ఉన్న 23 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 8678 మంది విద్యార్థినీ,విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 398 జూనియర్ కళాశాలలు మధ్యాహ్న భోజనం అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానమై ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడే నాణ్యత కలిగిన భోజనాన్ని తయారు చేసి సరైన సమయానికి పంపిస్తారన్నారు. మిగిలిన 77 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకున్నామన్నారు.
మధ్యాహ్న భోజనం మెనూ కూడా ప్రతిరోజు ఒకటే కాకుండా, రోజు కొక విధంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. సోమవారం` కూరగాయల పలావ్, కోడిగుడ్డుకూర, వేరుశనగ బెల్లం చిక్కి, మంగళవారం` పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ, బుధవారం`కూరగాయల అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కి , గురువారం ` సాంబార్ బాత్/లెమన్ రైస్, టమోట పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, శుక్రవారం` అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కి, శనివారం`ఆకుకూర అన్నం, పప్పుచారు, రాగిజావ, స్వీట్ పొంగల్ .. ఈ విధంగా ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లతో సమతుల ఆహారం ఉండే విధంగా మెనూ ఉందని సీఎస్ వివరించారు..
రాష్ట్రం, దేశం గర్వించదగ్గ మంచి పౌరులుగా, మంచి మేధావులుగా, అన్ని రంగాల్లో కూడా విశేష ప్రతిభను చూపించి ఈ కళాశాలకు మంచి పేరు తీసుకొని రావాలని విద్యార్థులను సీఎస్ ఆశీర్వదించారు..
విద్యార్థులతో సహపంక్తి భోజనం
మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి సీఎస్ సహపంక్తి భోజనం చేసారు. సీఎస్ తో పాటు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి విద్యార్థులతో కలిసి స్వీట్ పొంగల్, అన్నం, పప్పుచారు తో కూడిన భోజనాన్ని స్వీకరించారు..