- 52వ రోజు ప్రజాదర్బార్‌కు బారులు తీరిన జనం
- రాష్ట్రం నలుమూలల నుంచి వినతుల వెల్లువ
- పరిశీలించి న్యాయం చేస్తానని మంత్రి హామీ
అమరావతి (చైతన్యరథం): భూ సమస్యలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు… ఇలా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు ఆశాకిరణంలా కన్పిస్తున్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న బాధిత ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు యువనేత లోకేష్. ఉండవల్లి నివాసంలో 52వ రోజు మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీఎత్తున తరలివచ్చిన బాధిత ప్రజలకు అండగా ఉంటానంటూ లోకేష్ సాంత్వన కల్పించారు. తనను కలుస్తున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉంటుండటంతో రెవిన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలకు పరిష్కారం చూపాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. బాధితులు మళ్లీమళ్లీ తనను కలవకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని లోకేష్ సూచించారు.
జాతీయ రహదారి అలైన్‌మెంట్ మార్చాలి
నరసరావుపేట సమీపంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి ఎలైన్‌మెంట్ మార్పుచేయాలంటూ ప్రభావిత ప్రజలు ఎమ్మెల్యే అరవిందబాబుతో కలసివచ్చి లోకేష్‌కు వినతిపత్రం సమర్పించారు. చీరాల ఓడరేవు నుంచి నకరికల్లు వరకు 167`ఎ 4లైన్ల జాతీయ రహదారిని ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు 2022లో ప్రతిపాదించారు. ఇందులో అంతర్భాగంగా ఉన్న నరసరావుపేట బైపాస్ నిర్మాణానికి 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో నరసరావుపేట దక్షిణం వైపు బైపాస్‌కు ప్రతిపాదించిన ఆప్షన్ -3 వల్ల 5 గ్రామాల ప్రజలు, రైతులు పెద్దఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. రైతులకు తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ -2ను అమలు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే అరవిందబాబు నేతృత్వంలో మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు.
కరోనా సమయంలో తన బిడ్డ వైద్యం కోసం కుదువపెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా మేనమామ వేధిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం తోటచర్లకు చెందిన గుమ్మడివెల్లి పద్మావతి ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో నా బిడ్డ వైద్యం కోసం 120 గ్రాముల బంగారాన్ని కుదువపెట్టి మేనమామ వెంకటేశ్వరరావు వద్ద రూ.3 లక్షలు అప్పు తెచ్చాం. వైద్యం చేయించినా మా బిడ్డ బతకలేదు. అంతకు ముందు 2019 ఎన్నికల సమయంలో మా రెండో బిడ్డ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఇద్దరు బిడ్డలను పోగొట్టుకొని కడుపుకోతతో ఉన్న మేము అప్పుగా తీసుకున్న రూ.3 లక్షలు ఇస్తామని చెబుతున్నా బంగారం ఇవ్వడం లేదు. దీనిపై డీఎస్పీ నుంచి ఎస్‌ఐ వరకు పలుమార్లు కలిసినా న్యాయం జరగలేదు. తమ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మంత్రి లోకేష్‌ని కోరుతూ పద్మావతి కన్నీళ్ల పర్యంతమైంది.
పుట్టుకతో తీవ్ర అనారోగ్యంతో జన్మించిన తమ బిడ్డకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కడప జిల్లా బద్వేలుకు చెందిన ఎల్.కొండమ్మ విన్నవించింది. ఒళ్లంతా పొక్కులతో కొలేడన్ బేబీగా జన్మించిన బిడ్డకు తమిళనాడులోని కంచి కామకోటి హాస్పటల్‌లో రూ.15లక్షలు ఖర్చుచేసినా ప్రయోజనం కలగలేదు. కలెక్టర్‌కు రెండుసార్లు విన్నవిస్తే కడప రిమ్స్‌కు రాశారు. అక్కడ కూడా సరైన మందులు ఇవ్వడం లేదు. ప్రైవేటుగా మందులు కొనుగోలు చేస్తే ప్రతినెలా రూ.10వేలు ఖర్చవుతోంది. రెక్కాడితే గానీ డొక్కాడని తమకు పెన్షన్, ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని పద్మావతి వేడుకుంది.
ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్‌లో కోమాలోకి వెళ్లిన తమ బిడ్డకు ఆర్థిక సాయం అందించాలని కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం పల్లవోలుకు చెందిన మింగాల అశోక్ తండ్రి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్లిన బిడ్డ వైద్యానికి రూ.18 లక్షలు ఖర్చయినా ప్రయోజనం లేదు. ఇప్పటికీ వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు. లారీకి వెళ్లి కుటుంబాన్ని పోషించే తాను కూడా పక్షవాతానికి గురయ్యానని, దీంతో బతుకు బండి లాగడం భారంగా మారిందని చెబుతూ ఆదుకోవాలని విన్నవించారు.
వైసీపీ నేతల అండతో ఓ వ్యక్తి విశాఖలోని తమ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం మోపర్రుకు చెందిన కృష్ణప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ మాధవధారలోని సర్వే నెం.13/3లో 1991లో నేను 342 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాను. ఆ ప్రాంతానికి చెందిన సనపల సీతారాం అనే వ్యక్తి వైసీపీ నేతల అండతో తమను బెదిరిస్తూ సర్వే నెంబర్‌లోని ఏడు ఎకరాల భూమి ఆయనదేనని అంటున్నాడు. తనతోపాటు మరో నలుగుర్ని కూడా స్థలంలోకి అడుగుపెట్టనీయడం లేదు, న్యాయం చేయాలని కృష్ణప్రసాద్ కోరారు.
అంగన్ వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడుకు చెందిన మేస్త్రి గుంజి వెంకటేశ్వర్లు వినతిపత్రం సమర్పించారు. 2018లో ముట్లూరులో 2 భవనాలు, గారపాడులో ఒక అంగన్ వాడీ భవనం నిర్మించాం. ఇందుకోసం రూ.30 లక్షలు వెచ్చిస్తే గత టీడీపీ ప్రభుత్వంలో రూ.11 లక్షలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లు తిప్పించుకొని రూ.4 లక్షలు ఇచ్చారు. వైసీపీ రంగులు వేయడానికి మరో రూ.6 లక్షలు ఖర్చుచేయించారు. చెప్పులరిగేలా కలెక్టర్ చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు. అప్పుల పాలైన తనకు బిల్లులు చెల్లించి ఆదుకోవాలని విన్నవించారు.
కర్నాటకలో మెడిసిన్ చదువుతూ అదృశ్యమైన తమ బిడ్డ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం శెట్టి విన్నవించారు. కర్నాటక అర్తిబెళ్లిలోని ఆక్స్‌ఫర్డ్ మెడికల్ కాలేజీలో నా బిడ్డ సురేష్ బాబు ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతూ 100రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. కర్నాటక పోలీసులతో మాట్లాడి తమ బిడ్డ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాల్సిందిగా కోరారు.
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వీకరించిన మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.