- కార్యకర్తల కుటుంబాలకు భువనమ్మ పరామర్శ
- రూ. 3 లక్షల ఆర్థికసాయం అందజేత
- బద్వేల్ నియోజకవర్గంలో ‘నిజం గెలవాలి’
బద్వేల్(చైతన్యరథం): ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాణాలకు తెగించి మరీ టీడీపీని కాపాడుకుంటున్నది కార్యకర్తలేనని, వారి కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే ధైర్యం చెప్పి ఆదుకోవటం తమ కర్తవ్యం అని పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా గురువారం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయం అందించేందుకు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా గురువారం బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో రెండు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి రూ.3 లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందచేశారు. తొలుత పోరుమామిళ్ల గ్రామం, బలిజ కోటలో గత ఏడాది అక్టోబర్ 15వ తేదీన మృతి చెందిన మునెళ్లి అక్కమ్మ (45) కుటుంబాన్ని, తరువాత గత ఏడాది సెప్టెంబర్ 12వ తేదీన మృతి చెందిన మెహబూబ్ చాంద్(40) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తనను చేసి భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులను భువనేశ్వరి ఓదార్చారు.