మచిలీపట్నం, అవనిగడ్డ (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీకి మూలస్తంభాలు కార్యకర్తలేని పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. అధికార వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన వేధింపులకు వెరవకుండా పార్టీని కాపాడుకోవటంలో కార్యకర్తల త్యాగాలు ఎనలేనివన్నారు. అలాంటి కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవటం తమ కర్తవ్యమన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పి, కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం పత్రాలు అందించేందుకు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం భువనేశ్వరి కృష్ణా జిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గం, మచిలీపట్నం రూరల్ మండలం, కోన గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 25న మృతి చెందిన పిట్లల బసవయ్య(48), మచిలీపట్నం పట్టణం, 23వ వార్డులో గత ఏడాది అక్టోబర్ 29న మృతిచెందిన మట్టా సోమయ్య(63), అవనిగడ్డ నియోజకవర్గం, ఘంటశాల మండలం, తాడేపల్లి గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 9న మృతి చెందిన కొడాలి సుధాకరరావు (62) కుటుంబాలను భువనేశ్వరి. పరామర్శించారు.