- తనను కలిసేందుకు వచ్చేవారికి పవన్ విజ్ఞప్తి
- త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తాను
- 20 తర్వాత పిఠాపురంలో పర్యటిస్తా
అమరావతి: తనను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలు తీసుకురావొద్దని జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ గురువారం తన భార్య అన్నా లెజనోవాతో కలిసి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని ఒక ప్రకటనలో వెల్లడిరచారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక అన్ని వైపుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నేతలు, మేధావులు, నిపుణులు, సినీ ప్రముఖులు, యువత, రైతులు, ఉద్యోగులు, మహిళలు అభినందనలు తెలుపుతున్నారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలిసి మాట్లాడతాను. దీనికి సంబంధించిన షెడ్యూలు జనసేన ప్రధాన కార్యాలయం నుంచి వెలువడుతుంది. అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దు. ఇది నా విజ్ఞప్తి. ఈ నెల 20 తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా ఉంటాయి. పిఠాపురం ప్రజలు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ, అసెంబ్లీ సమావేశాలు ముగించుకున్న అనంతరం పిఠాపురం నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలుస్తాను. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు.