- ఫిర్యాదులన్నీ గత పాలకుడి దాష్టీకంపైనే..
- బాధితులకు బాసటగా ప్రజా ప్రభుత్వం
- ప్రజాదర్బార్‌లో మంత్రి కొల్లు రవీంద్ర హామీ
- సమస్యలతో వచ్చిన వారికి తక్షణ పరిష్కారం
- తప్పుడు కేసులు, సమస్యలపై అధికారులకు ఫోన్
- తెదేపా కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన బాధితులు
అమరావతి (చైతన్య రథం): ప్రశ్నిస్తే కేసు, ఎదురిస్తే దాడి అన్నట్టు సాగిన జగన్‌రెడ్డి అరాచకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని గనులు, భూగర్భ మరియు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. జగన్‌రెడ్డి అరాచక ఏలుబడిలో ఇబ్బందులు ఎదుర్కొన్న వందలాది బాధితులనుంచి మంత్రి వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూఅక్రమాలు, గనులు మైనింగ్ దోపిడీలపైనే ఫిర్యాదులు రావడంపట్ల మంత్రి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తప్పులుచేసి తిరిగి కేసులు పెట్టినట్లు పలువురు బాధితులు పేర్కొనడంతో.. అక్కడికక్కడే అధికారులతో మంత్రి రవీంద్ర మాట్లాడారు. భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం మత్స్యపురికి చెందిన మహిళ గల్ఫ్ దేశాల్లోని మస్కట్‌కు ఉద్యోగం కోసంవెళ్లి ఏడాదిగా అక్కడే చిక్కుకుపోయింది. ఆమెను తిరిగి స్వస్థలానికి రప్పించేందుకు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేతలతో మాట్లాడి సమస్య వివరించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లకు చెందిన కొమరగిరి శివమ్మ రెండో కుమారుడిని ఆమె కోడలు తన ప్రియుడితో కలిసి హత్య చేయించింది. కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తుండడంతో.. పల్నాడు జిల్లా ఎస్పీతో మంత్రి మాట్లాడి కేసు నమోదు చేయించారు. నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. పాలకొండ నియోజకవర్గం పరిధిలోని భామిని మండలి బాలేరు గ్రామ పంచాయతీలో వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఏపీ నుండి ఇసుక ఒడిశాకు తరలించి అమ్ముకుంటున్నారు. దాన్ని ప్రశ్నించినందుకు తెలుగుదేశం నాయకుడు గోవిందరావు, అతని భార్య, కుటుంబీకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కు విషయం వివరించి అక్రమ ఇసుక తరలింపు అడ్డుకోవాలని, అక్రమ కేసుల విషయంలో చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అదే సమయంలో నామినేటెడ్ పదవుల కోసం వచ్చిన పార్టీ కార్యకర్తల నుండి మంత్రి వినతులు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిననాటి నుండి రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలైందన్నారు. గతంలో ప్రజల సమస్యలు పట్టించుకునే నాధుడే లేడన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రజల కోసమేనని సమర్థ పాలనతో నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. మంత్రులు ఎన్ని పనులున్నా, ఎంతటి సమస్యల్లోవున్నా ప్రతి రోజూ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని నిర్ణయించడం ప్రజలపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇక్కడకు వచ్చిన వారిలో ఎక్కువమంది అక్రమ కేసుల బాధితులే ఉన్నారని, జగన్‌రెడ్డి ఎంతగా కక్ష సాధింపులకు పాల్పడ్డారో ఫిర్యాదులే చెబుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడానికే తాము ఉన్నామని, నిత్యం వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టితో పని చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.