- 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలి
- ఈసీ మార్గదర్శకాలను పాటించాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈసీ ఆదేశాలు
అమరావతి: వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) ఆదేశించారు. కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లపై న్యూ ఢల్లీిలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం (నిర్వాచన్ సదన్) నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా సీఈసీతో పాటు ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు హాజరయ్యారు. ఆరు దశల్లో ఇప్పటి వరకూ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలతోపాటు 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు / డీఈఓలు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎమ్‌ఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దేశంలో ఈసారి ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ పూర్తయింది. మరొక్క విడత మిగిలుంది. జూన్ 4న దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో, ఢల్లీి నుంచి సీఈసీ రాజీవ్ కుమార్ ఓట్ల లెక్కింపుపై సమీక్ష చేపట్టారు. లోక్‌సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఇక, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరే ఏపీలోనూ కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. భద్రత కోసం ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. 24 జిల్లాలకు 56 మంది ఏఎస్పీలు, డీఎస్పీలను నియమించారు. నాన్ క్యాడర్ ఎస్పీలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలను అత్యంత భద్రత ఉండే రెడ్ జోన్లుగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపడతారు. సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే ఫలితాలను వెల్లడిరచనున్నారు. కౌంటింగ్ రోజున 200 మంది కేంద్ర పరిశీలకులు, 200 మంది రిటర్నింగ్ అధికారులు విధుల్లో ఉంటారు.
స్ట్రాంగ్‌రూమ్‌లు పరిశీలించిన సీఈవో
కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా స్ట్రాంగ్‌రూమ్ ల భద్రతను పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సోమవారం గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ వద్ద ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లను మీనా పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఈవో ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడిరచారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని… అభ్యర్థులు, ఏజెంట్లు రెండుసార్లు పరిశీలించే అవకాశం కల్పించామని వివరించారు. అల్లర్ల దృష్ట్యా రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించామని, కౌంటింగ్ రోజు, ఆ తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని మీనా వివరించారు. ప్రస్తుతం పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.