వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికీ తాగునీటి కుళాయి అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కమలాపురం నియోజకవర్గం చెన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద స్థానిక ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 13వేల మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. టీడీపీ పాలనలో మా గ్రామానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.25కోట్లు కేటాయించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది, డ్రైనేజీ ఊసెత్తడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి డ్రైనేజీలు నిర్మించండి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామసీమలను నిర్వీర్యం చేశారు. పంచాయతీలకు చెందిన రూ.8,600కోట్లను జగన్ దారి మళ్లించాడు. గ్రామాల్లో రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదు, పరువుకోసం భయపడి సొంత డబ్బులతో పనులుచేసిన సర్పంచ్ లు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు నిర్మించామని లోకేష్ వారికి చెప్పారు.