- ఆహారం, నీళ్లు.. డోర్ టు డోర్ డెలివరీ
- పాతిక కిలోల బియ్యం, నిత్యావసరాలు కూడా
- మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలు..
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
- అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలి..
- నష్టాలు వివరించి కేంద్రసాయం అడుగుదాం
- టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇపుడిపుడే తేరుకుంటున్న కృష్ణా ముంపు ప్రాంతాల పరిస్థితి, ప్రభుత్వం నిర్వహిస్తోన్న సహాయక చర్యలపై బుధవారం ఉదయం మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సాయం అందాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వరద నీరు చాలావరకూ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. బాధిత ప్రజలకు సరఫరా చేస్తోన్న ఆహారం డోర్ టు డోర్ తీసుకెళ్లి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్‌గా అందించాలని, ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, కేజీ చక్కెర ఇంటివద్దే అందించాలని ఆదేశించారు.
మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా అన్ని అంబులెన్స్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి, మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాలని సూచించారు. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరఫునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించాలని సూచించారు.
జ్వరాలనుంచి జాగ్రత్తలపై కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని, ఎవరికి ఏ మెడిసిన్ కావాలన్నా అందుబాటులో ఉంచాలని సూచించారు. పంటనష్టంపై అంచనాలు నమోదు చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని, శానిటేషన్ పనులు యుద్ధప్రాతిపదికన సాగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చి.. ముంపునకు గురైన ఇళ్లలో బురదను శుభ్రం చేసే బాధ్యత త్వరితగతిన నిర్వర్తించాలంటూనే.. ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కృష్ణా వరద కారణంగా సంభవించిన నష్టాలను కేంద్రానికి వివరించి సాయం కోరదామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సమృద్ధిగా ఆహారం, నీళ్లు సరఫరా
బుధవారం ఉదయం 2.3 లక్షల అల్పాహార ప్యాకెట్లు వరద బాధితుల పంపిణీకి తరలించినట్టు చెప్పారు. 4.5 లక్షల మందికి మధ్యాహ్నం, సాయంత్రానికి భోజనం సిద్ధం చేస్తున్నామని సీఎంకు మంత్రులు, అధికారులు నివేదిక ఇచ్చారు. 2.5 లక్షల పాల ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిళ్లతో పాటు 117 ట్యాంకర్లను ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, మరో 6 లక్షల నీళ్ల బాటిళ్లు సిద్ధంగా ఉంచామన్నారు. వాటర్ ప్యాకెట్లు 10 లక్షల తరలించామని, మరో 6 లక్షలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయని, వాటితో పారిశుధ్య పనులు మొదలు పెట్టినట్టు సీఎం చంద్రబాబుకు నివేదించారు.