- దీనివల్ల రైతులు, మత్స్యకారులకు తీరనినష్టం
- దీనివల్ల రైతులు, మత్స్యకారులకు తీరనినష్టం
కాకినాడ: కాకినాడ తీరంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు కేంద్రప్రభుత్వానికి విజ్జప్తిచేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు లేఖరాస్తూ కాకినాడలో ఏర్పాటు చేయబోయే డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తీరంలో ఏర్పాటుచేసే ఈ పార్కు వల్ల రైతులు, మత్స్యకారులు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. లేఖ కాపీలను జాతీయ హరిత ట్రైబ్యునల్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. లేఖ సారాంశం ఇలా ఉంది. కాకినాడలో సెజ్ ఏర్పాటు కోసం రైతుల నుంచి అప్పటి వైఎస్ ప్రభుత్వం 8,500 ఎకరాల భూమిని సేకరించింది. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమ వల్ల మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. అయితే, అందుకు విరుద్ధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు ఫార్మా పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫార్మా పార్క్ ఏర్పాటు చేస్తే.. అది నేల, నీరు, వాయు, సముద్రం కలుషితమై రైతులు, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫార్మా పార్క్ ను వ్యతిరేకిస్తూ రైతులు, మత్స్యకారులు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారని యనమల తెలిపారు.