- సామాన్య భక్తులకు పెద్దపీట
- మూలా నక్షత్రం రోజున పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
- దేవాదాయ మంత్రి ఆనం వెల్లడి
విజయవాడ(చైతన్యరథం): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ ఏడాది జరగనున్న దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిగే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించే విషయమై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి), జిల్లా కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ సీవీ రాజశేఖర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరాం సత్యనారాయణ, ఆలయ ఈవో కేఎస్ రామారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం మంత్రి రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా చర్యలను తీసుకుంటున్నామన్నారు.
ఇప్పటికే స్థానిక శాసనసభ్యుడు సుజనా చౌదరి పలుమార్లు ఉత్సవాల నిర్వహణపై సమీక్షలను నిర్వహించాన్నారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ (చిన్ని), శాసనసభ్యుడు సుజనా చౌదరి, కూటమి నాయకుల సహకారంతో ఐక్యంగా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. రోజుకి రెండు లక్షలమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది కనుక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఆటంకాలు జరగకుండా అందరి సహకారంతో విజయవంతంగా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.