- సీఎంపై రాయి పడిన ఘటనలో ఆరు అంశాల్లో వైఫల్యం
- రాష్ట్రానికి 50 సాధారణ, 18 మంది పోలీసు పరిశీలకులు
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద నిఘాకు రెండు కెమెరాలు
- మద్యం సరఫరా నియంత్రణకు వెబ్‌కాస్టింగ్, జీపీఎస్ ట్రాకింగ్
- ఇప్పటి వరకు రూ.121 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులు సీజ్
- 1017 మంది వాలంటీర్ల సస్పెన్షన్…44,163 మంది రాజీనామా
- మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె.మీనా
అమరావతి,చైతన్యరథం: అధికార దుర్వినియోగం చేశారంటూ ఫిర్యాదులు వచ్చిన ఏపీ సీఎస్, నిఘా విభాగపు డీజీలతో పాటు ఇతర ఉన్నతాధికారులపై త్వరలోనే ఈసీ నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె.మీనా తెలిపారు. పెన్షన్ల పంపీణీలో డోర్ టూ డోర్ పంచేందుకు అవకాశం ఉన్నప్పటికీ మండుటెండల్లో వృద్ధులను సచివాలయాలకు రప్పించి వారిలో కొందరు చనిపోవడానికి ఏపీ సీఎస్ జవహార్‌రెడ్డి కారకుడయ్యాడని, అలాగే నిఘా విభాగపు డీజీ, ఇతర ఉన్నతాధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని… రాజకీయ పార్టీల నుండి ఫిర్యాదులు వచ్చాయని, ఈసీ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదులపై వారి నుండి వివరణలు తీసుకొని పంపించామని, వీటిపై ఈసీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
సీఎం జగన్మోహన్‌రెడ్డిపై రాయి పడిన ఘటనకు సంబంధించి ఆరు అంశాల్లో వైఫల్యం ఉన్నట్లు గమనించామని, సీఎం జగన్మోహన్‌రెడ్డిపై రాయి పడిన ఘటనకు సంబంధించి ఆరు అంశాల్లో వైఫల్యం ఉన్నట్లు గమనించామని, లైట్లు లేకపోవడం, స్పాటర్లు లేకపోవడమనే రెండు అంశాలను ప్రస్తావించారు. మిగిలిన నాలుగు అంశాలను చెప్పడానికి నిరాకరించారు. ఈ అంశాల వైఫల్యం నేపథ్యంలో వీఐపీ భద్రతకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించి పోలీసులకు పంపినట్లు చెప్పారు. కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు విజయవాడ సీపీ చెప్పారని, ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ఉందా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకురాలు దృష్టి పెట్టారని, కేసు దర్యాప్తుకు సంబంధించి ప్రతి రోజు ఆమెకు పోలీసుల నివేదికలు వెళ్తున్నాయని, ఈనెల 24వ తేదీన ఆమె రాష్ట్రానికి వచ్చి అందరితో చర్చించి సమగ్ర నివేదిక తయారు చేసి ఎన్నికల సంఘానికి పంపిస్తారని తెలిపారు. ఆమె నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని వెల్లడిరచారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎం.కె. మీనా మాట్లాడారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షణకు రెండు కెమెరాలు
రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 వేల పోలింగ్ కేంద్రాల్లో 12,459 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. వీటితోపాటు మొత్తం 30,111 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. అయితే ఈసారి పోలింగ్ బూత్ లోపల మాత్రమే కాక బయట నిల్చున్న క్యూను కూడా కవర్ చేసేట్లుగా మొత్తం రెండు కెమెరాలను పర్యవేక్షణకు వాడుతున్నట్లు చెప్పారు. పోటీ చేసే అభ్యర్ధుల కోరిక మేరకు వెబ్ కాస్టింగ్ చేసే పోలింగ్ కేంద్రాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ఒక సాధారణ, ఒక పోలీస్, ఒకరు ఎన్నికల ఖర్చును పర్యవేక్షించే పరిశీకులను ఎన్నికల సంఘం నియమించిందని చెప్పారు. వీరికి తోడుగా నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలను పర్యవేక్షించేందుకు 50 మంది సాధారణ పరిశీలకులు, 75 మంది ఖర్చును పర్యవేక్షించే పరిశీలకులను నియమించామని చెప్పారు. వీరితోపాటు రాష్ట్రంలో మొదటిసారిగా ఎక్కువ సంఖ్యలో 18 మంది పోలీస్ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందని చెప్పారు. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అధికంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే రాష్ట్రాన్ని క్రిటికల్ స్టేట్‌గా భావించి కేంద్ర ఎన్నికల సంఘం ఇంతమంది పోలీస్ పరిశీలకులను నియమించిందని తెలిపారు.
ఆరు నియోజకవర్గాల్లో ముందే ముగియనున్న పోలింగ్
ఎన్నికల నోటిఫికేషన్‌లో పోలింగ్ సమయాన్ని కూడా సూచించామని, ఆరు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన 169 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. అయితే ఎస్‌టీ నియోజకవర్గాలైన అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరంలలో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ సాగుతుందని, ఇక పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు.
హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం
సవరించిన ఎన్నికల నిబంధనల ప్రకారం 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. వీరికి పోస్టల్ బ్యాలెట్ పద్దతిలో ఓటు హక్కు వినియోగించుకుంటారన్నారు. ఇంటి వద్ద నుండే ఓట్ వేస్తారా అనే అప్షన్ తీసుకునే ప్రక్రియను గురువారం నుండి ప్రారంభించినట్లు చెప్పారు. అప్షన్ ఇచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా వచ్చే నెల రెండో తేదీ నుండి పదో తేదీలోపు పూర్తి చేస్తామని చెప్పారు. వీరితోపాటు ఎన్నికల విధుల్లో దాదాపు ఐదున్నర లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారని, వీరిందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని, ఈ పక్రియ అంతా వచ్చే నెల ఐదో తేదీ నుండి 10వ తేదీ వరకు పూర్తవుతుందని చెప్పారు.
మద్యం సరఫరా నియంత్రణకు చర్యలు
ఎన్నికల్లో మద్యం సరఫరా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక నుండి మద్యం తయారీ అయ్యే ఫ్యాక్టరీ వద్ద నుండి పర్యవేక్షణ ఉంటుందని, ఫ్యాక్టరీ వద్ద వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని, సరకు గోడౌన్‌కు తరలించేవరకు, గోడౌన్ల నుండి మద్యం షాపులకు తరలించే వరకు జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ చేస్తామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 121 కోట్ల రూపాయల విలువ చేసే నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇందులో 31 కోట్ల రూపాయల మేరకు నగదు ఉందని, ఇందులో 18 కోట్లు ఎన్నిలకు సంబంధం లేని డబ్బుగా తేల్చి వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. డబ్బు స్వాధీనం విషయంలో సామాన్యులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు ఆ డబ్బు ఎన్నికలకు సంబంధం లేని దైనా, వేరే ఇతర నేరాలకు సంబంధించింది కాకపోయినట్లయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. ఇటువంటి నగదుపై ఆ రోజునే గ్రీవేన్స్ సెల్ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
వెయ్యి మంది వాలంటీర్ల సస్పెన్షన్
ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న 1017 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగించినట్లు ఎం.కె.మీనా తెలిపారు. వీరు కాకుండా 44,163 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారని తెలిపారు. సస్పెండ్ అయిన, రాజీనామా చేసిన వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్‌గా కూర్చోకోకూడదనే నిబంధనేదీ లేదని, అయితే ఈ అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని చెప్పారు. అలాగే ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 181 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా విధుల నుండి తొలగించినట్లు చెప్పారు. మరో 127 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ఫిర్యాదులు వచ్చాయని, 59 మందిని సస్పెండ్ చేశామని, 127 మందిపైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించి వైసీపీ నాయకులపై 136 కేసులు, టీడీపీ నాయకులపై 126 కేసులు, ఇతర పార్టీల నాయకులపై 76 కేసులు పెట్టినట్లు ఎం.కే. మీనా వెల్లడిరచారు.