- గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఎస్పీలు బదిలీ
- కృష్ణా, తిరుపతి, అనంతపురం కలెక్టర్లకు స్థానచలనం
- విధుల నుంచి తక్షణం వైదొలగాలని ఆదేశం
- ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని స్పష్టీకరణ
చట్టాలను ఏ మాత్రం లెక్కచేయకుండా అధికార వైసీపీ సేవలో తరించిపోతున్న జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం మొదటి షాక్ ఇచ్చింది. ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెకర్లపై బదిలీ వేటు వేసింది. వీరిని బదిలీ చేస్తూ మంగళవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ముందు ఏరికోరి బదిలీ చేసిన అనుకూల అధికారులను ఈసీ కదిలించటం జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు మింగుడు పడని విషయమే. ఈ అధికారులందరూ జగన్‌కు జీ హుజూర్ అంటూ..యథేచ్ఛగా అడ్డగోలు పనులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నవారే. అంతకు ముందు సరే.. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వారు మారలేదు. పాలనా పగ్గాలు ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లాయనే వాస్తవాన్ని విస్మరించి, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రజాస్వామ్యం కన్నా జగన్‌స్వామ్యమే పరమావధిగా తప్పుడు పనులకు పాల్పడటంతో చివరికి ఈసీ వేటుకు గురయ్యారు.
రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తమ కింది అధికారులకు బాధ్యతలు అప్పగించి.. వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి తక్షణమే ముగ్గురు అధికారులతో ప్యానల్ పంపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్ మీనాను ఈసీ ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఆదేశాలను.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి సీఈవో మీనా పంపించారు.
ఆయా జిల్లాల ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న కృష్ణా, తిరుపతి, అనంతపురం జిల్లాల కలెక్టర్లు రాజబాబు, లక్ష్మీషా, గౌతమి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె. తిరుమలేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు పడిరది. అధికార వైసీపీ అడుగులకు మడుగులొత్తుతూ చట్టానికి పాతరేసి నిస్సిగ్గుగా అక్రమార్కులకు వంత పాడుతున్న అధికారులపై చర్యలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఈసీ తీసుకున్న ఈ చర్యలు సంతోషాన్ని కలిగించాయి. అదే సమయంలో జగన్‌రెడ్డి, వైసీపీ నేతల సేవలో మునిగితేలుతున్న, చట్టవిరుద్ధంగా నడుచుకుంటున్న అధికారుల్లో కలవరం మొదలయింది. ఈసీ చర్యలు ఇంతటితో ఆగబోవనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. కాగా ఇది మొదటి విడతేనని.. తర్వాత అసలైన షాకులుంటాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెబితే అదే వేదం అన్నట్లుగా ఉంటారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గుంటూరు ఐజీ జోన్ పరిధిలోని చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్డీఏ కూటమి బహిరంగసభలో భద్రతా వైఫల్యంతో గందరగోళం ఏర్పడిరది. ఈ సందర్భంగా విధుల్లో ఉండాల్సిన ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సభను విఫలం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో నివేదిక పంపారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పలు జిల్లాల్లో రాజకీయ హింస చోటు చోసుకుంది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. అలాగే పల్నాడు జిల్లాలోని మాచర్లలో దాడులు చోటు చేసుకున్నాయి. ఈ మూడు ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. సీఈఓ కూడా దీనిపై ఆయా జిల్లాల ఎస్పీలను పిలిపించి మాట్లాడి, వారి వివరణతో ఈసీకి నివే దిక పంపించారు.
గతంలో ఈ అధికారుల వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులతో పాటు,ప్రధాని నరేంద్రమోదీ హాజరైన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాల నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీని, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మునియ్య హత్య నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీని ఈసీ బదిలీ చేసింది. ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 12న తిరుపతి నుంచి ప్రకాశం జిల్లాకి బదిలీపై వచ్చారు. పరమేశ్వరరెడ్డిని ప్రకాశం జిల్లాకి బదిలీ చేయటం వెనుక ఒంగోలు ఎంపీ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చక్రం తిప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో అనుకూలంగా పనిచేయించుకునే ఉద్దేశంతోనే పరమేశ్వరరెడ్డిని చెవిరెడ్డి ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 50 రోజుల్లోనే ఆయనపై పరమేశ్వరరెడ్డిపై బదిలీ వేటు పడిరది.
నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి
నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఏక పక్షంగా వైసీపీకోసం పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన మామ స్థానికంగా వైసీపీ నాయకుడు కావటంతో ఎస్పీ క్యాంపు ఆఫీసును వైసీపీ బ్రాంచ్ కార్యాలయంలా మార్చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆయనను ఎన్నికల విధుల నుండి తప్పించాలంటూ టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం ఇటీవలే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.
చిత్తూరు ఎస్పీ జాషువా
ప్రస్తుతం చిత్తూరు ఎస్పీగా ఉన్న జాషువా ఇంతకు ముందు కృష్ణాజిల్లా ఎస్పీగా ఉన్నప్పటి నుంచీ అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగానే నడుచుకునేవారని విమర్శలు ఉన్నాయి. వైసీపీ నేతలు దాడులు చేస్తే, బాధితులైన టీడీపీ నాయకులపైనే కేసులు పెట్టేవారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు పేకాట క్లబ్‌లు, క్యాసినోలు నడిపినా పట్టించుకోలేదు. ఆయన ఇటీవల చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా ఆయన వ్యవహారశైలిలో ఏ మాత్రం మార్పురాలేదు. ఆయనపై వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకుంది.