- గిరిజన ఉత్పత్తుల ప్రోత్సాహానికి సహకరిస్తా
- గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణికి మంత్రి లోకేష్ హామీ
అమరావతి (చైతన్యరథం): పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు, గిరిజన ఉత్పత్తుల ప్రోత్సాహానికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి గురువారం మంత్రి లోకేష్‌ని కలిసి గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. సోదరి, మంత్రి సంధ్యారాణి గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌ను తనకు బహుమతిగా ఇచ్చారని తెలిపారు. పూర్తిగా ఆర్గానిక్ విధానంలో పండిస్తున్న అరకు కాఫీ ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడిరచిందన్నారు. గిరిజన ఉత్పత్తుల బ్రాండ్ ఇమేజ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ, బిల్ గేట్స్ వంటి ప్రముఖులను కలిసినపుడల్లా వారికి అరకు కాఫీతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌ను అందజేస్తూ విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నారన్నారు. సోదరి సంధ్యారాణి కోరిన విధంగా అసెంబ్లీ తరహాలో పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు, గిరిజన ఉత్పత్తుల ప్రోత్సాహానికి తన వంతు సహాయ, సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.