- రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖల మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ హామీ
- మంత్రి ఫరూక్‌ను కలిసిన ఏడు రాష్ట్రాల ప్రతినిధుల బృందం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని ఆంగ్లో ఇండియన్ కుటుంబాల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖల మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ హామీ ఇచ్చారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని మంత్రి పేషీలో ఆంగ్లో-ఇండియన్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం (ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రాల బృందం) మంత్రి ఫరూక్‌ను కలిసింది. ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డా.ఎ.రాయ్ రోజారియో, ప్రధాన కార్యదర్శి ఎన్.పాట్రిక్ డూలాండ్, సభ్యులు బార్బరా ఆన్ బెర్చీ, అమలా వాలెస్, నిక్సన్ డి’క్రూజ్, కొరెట్టా అలియాస్ కవిత, కోరిన్ న్యూబెగింగ్‌లు మంత్రి ఫరూక్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి కే హర్షవర్ధన్, ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి డాక్టర్ ఏ.శేఖర్‌ల దృష్టికి ఆంగ్లో ఇండియన్లు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకొచ్చారు. రాష్ట్రంలో దాదాపు లక్ష దాకా ఆంగ్లో ఇండియన్ జనాభా ఉందని, ఎటువంటి అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోక వీరు పడుతున్న ఇబ్బందులను ఫెడరేషన్ ప్రతినిధులు వివరించారు.
ఆంగ్లో ఇండియన్స్‌కు చట్టసభల్లో ప్రాతినిధ్యానికి కేటాయింపులు, ఉన్నత విద్య, ఉపాధి కోసం రిజర్వేషన్ అమలు, బ్యాంకుల నుంచి రుణాలు అందేలా సరళీకృతమైన విధానాలు అమలు చేయాలని కోరారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఆంగ్లో ఇండియన్లకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపులో వివిధ సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించే చర్యలను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఆంగ్లో ఇండియన్ కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు, వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యలను సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫెడరేషన్ ప్రతినిధుల బృందానికి హామీ ఇచ్చారు. అనంతరం సిక్కుల సంఘం ప్రతినిధులు కూడా మంత్రి ఫరూక్‌ను కలిశారు. ఏపీలో సిక్కుల ఆర్థిక స్వావలంబన, సంక్షేమం కోసం ప్రత్యేకంగా సిక్కుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అండగా నిలవాలని మంత్రిని కోరారు. సిక్కు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుపైకూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.