అమరావతి: విద్యుత్ శాఖలోని ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్ ఎమ్ గ్రేడ్-II ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రికి విజ్జప్తి చేశారు. ఈ మేరకు సిఎం జగన్ కు ఆయన ఒక లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా ఉంది. విద్యుత్ శాఖలో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్ ఎమ్ గ్రేడ్-II ఉద్యోగులు విధినిర్వహణలో తాము ఎదుర్కొంటున్నసమస్యలు, తమకు జరుగుతున్న అన్యాయం నా దృష్టికి తీసుకొచ్చారు. వీరికి జరిగిన నష్టం, ఆవేదన, ఆందోళన పరిశీలించాను. వీరి న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని మీకు ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చారు. ఇరవై విభాగాలలో 1,34,000 పోస్టులను వివిధ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశారు. వీరిలోనే 7329 మందిని ఎనర్జీ అసిస్టెంట్లుగా (%జీూవీ GR-II%) నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, పల్లె ప్రాంతాల సచివాలయాల్లో వుంటూ విద్యుత్ సమస్యలు తెలుసుకుని విద్యుత్‌శాఖకి సమాచారం అందించి.. పరిష్కారానికి కృషి చేయడం, కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు, సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించేలా వినియోగదారుల్ని అప్రమత్తం చేయడం, విద్యుత్ అంతరాయం సమస్యలు తలెత్తితే విద్యుత్‌శాఖతో సమన్వయం చేసుకుని విద్యుత్ పునరుద్ధరణ చేయించడం, లోవోల్టేజీ-ట్రాన్స్ ఫార్మర్ సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపడం, వీధి దీపాలు పర్యవేక్షణ, విద్యుత్‌కి అంతరాయం కలగకుండా జంగిల్ క్లియరెన్స్ చేయించడం వంటి పనులని వీరి జాబ్ చార్ట్‌లో పొందుపరిచారు. గ్రామ/పట్టణ వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ వేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ విధులు నిర్వర్తించాలని గైడ్‌లైన్స్ పేర్కొన్నారు. సచివాలయాల్లో వుండి పనిచేయాల్సిన ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్ ఎమ్ గ్రేడ్-%II% ఉద్యోగులని విద్యుత్‌శాఖకి అండర్ టేకింగ్ చేశారు. జాబ్‌చార్ట్‌ని విస్మరించి కట్టుబానిసల్లా వాడుకోవడంతో వీరంతా తీవ్ర మానసిక ఆందోళనలో వున్నారు. సెలవుల్లేవు, పండగలు-పబ్బాల ఊసేలేదు. రాత్రీ పగలు తేడా లేకుండా పనిచేయిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. శిక్షణ కూడా లేని వీరిని ప్రమాదకరమైన 11కెవి, 33కెవి విద్యుత్ లైన్ల మరమ్మతులకి, స్తంభాలు ఎక్కిస్తుండడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇప్పటివరకూ విద్యుత్ ప్రమాదాలలో 89 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇండస్ట్రియల్ యాక్ట్ కింద వుండాల్సిన నియామకాలని సచివాలయం కింద చూపిస్తూ…లేబర్ యాక్ట్ అమలు చేయడంతో ప్రాణాలు కోల్పోయిన/ప్రమాదాలకి గురైన ఎనర్జీ అసిస్టెంట్లు పరిహారంలోనూ అన్యాయానికి గురయ్యారు. విద్యుత్‌శాఖ పనిచేస్తూ ప్రమాదానికి గురై చనిపోతే సచివాలయ ఉద్యోగి చనిపోయాడంటున్నారు. ఇదేం అన్యాయం అని అడిగే హక్కు కూడా లేదని అధికారులు బెదిరిస్తున్నారని ఎనర్జీ అసిస్టెంట్లు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులకి ఆదివారాలు ఇతర రోజులు కలిపి నెలలో 7 నుంచి 10 రోజులు సెలవులు ఉండగా, ఎనర్జీ అసిస్టెంట్లకి ఒక్క సెలవూ లేదు. సచివాలయాల్లో ఉంటూ 8 గంటలు పనిచేయాల్సిన వీరిని 24 గంటలూ విధినిర్వహణకి వాడుకోవడం శ్రమదోపీడియే. పేరుకి సచివాలయ ఉద్యోగులుగా వున్నా..గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నది విద్యుత్‌శాఖ కావడం వీరి ఉద్యోగ జీవితాలు రెండుశాఖల మధ్య నలిగిపోతున్నాయి. విద్యుత్‌శాఖ తమతో ప్రమాదకరమైన పనులు చేయిస్తూ…తాము ప్రమాదాల బారినపడి మరణిస్తే, మీరు సచివాలయ ఉద్యోగులు కాబట్టి విద్యుత్‌శాఖ రెగ్యులేషన్, బెనిఫిట్స్, కాంపెన్సేషన్ ఏవీ వర్తించవని తేల్చేయడం వీరికి తీరని అన్యాయం చేయడమే అవుతుంది. ఎనర్టీ అసిస్టెంట్ల అభిప్రాయం తీసుకోకుండానే వీరికి కొత్త నిబంధనలు, డ్యూటీ చార్ట్ రూపొందించి మరీ అమలు చేయడం హక్కుల్ని హరించడమే. 13,500 వేతనంతో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లతో ప్రమాదకరమైన విధులన్నీ చేయిస్తుండడం అన్యాయం. రిక్రూట్మెంట్ ఒక శాఖ కింద, విధినిర్వహణ మరోశాఖలో వుండడంతో ఎవరికీ చెందనివారిలా ఎనర్జీ అసిస్టెంట్లు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. సచివాలయాల్లో పనిచేసే 20 విభాగాలలో 19 శాఖలు ఉద్యోగులు వారి యొక్క ప్రొబేషన్ డిక్లేర్ చేసిన ప్రభుత్వం ఒక్క ఎనర్జీ అసిస్టెంట్లకి జీతాలువారితో పాటు పెంచినా ప్రొబేషనరీ ప్రకటించకుండా ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించారు. ఇప్పటికైనా మీరు స్పందించి 7329మంది ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్ ఎమ్ గ్రేడ్-%II% ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, వారి డిమాండ్లు నెరవేర్చాలని ఈ లేఖ ద్వారా కోరుతున్నాను. వీరందరినీ విద్యుత్‌శాఖలో తీసుకోవాలి. విద్యుత్‌శాఖలో జీతభత్యాలు అమలు చేయాలి.
విధినిర్వహణలో చనిపోయిన/గాయపడిన వారికి విద్యుత్‌శాఖ ఉద్యోగుల మాదిరిగానే పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మెడికల్ అలవెన్సులు ఇవ్వాలి. లేదంటే పూర్తిగా సచివాలయాల్లో నిర్దేశించిన పనిగంటలకే విధులు నిర్వర్తించుకునే అవకాశం కల్పించాలి. తక్షణమే ప్రొబేషనరీ డిక్లేర్ చేయాలి. విద్యుత్ ఉద్యోగులకి అమలుచేసే పీఆర్సీకి అనుగుణంగా జీతాలు పెంచాలని ఎనర్జీ అసిస్టెంట్లు చేస్తున్న న్యాయమైన డిమాండ్‌ని ఆమోదించాలని కోరుతున్నాను. సచివాలయం వ్యవస్థ అనే బూటకపు ముసుగులో ఎనర్జీ అసిస్టెంట్లతో విద్యుత్ శాఖ గొడ్డుచాకిరీ చేయించుకోవడం ఇకనైనా ఆపాలి. విద్యుత్‌శాఖ ఉద్యోగులకి ఇస్తున్న మెడికల్-సైకిల్ అలవెన్సు, కన్వేయన్స్, ఆర్జిత సెలవులు కూడా వర్తింపజేయాలని కోరుతున్న ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయమైన కోరికలు నెరవేర్చాల్సిందిగా లోకేష్ సిఎంకు రాసిన లేఖలో విజ్జప్తిచేశారు.