- రివర్స్ టెండరింగ్ పేరుతో ఆధునికీకరణను అటకెక్కించాడు
- నేడు కూటమి ప్రభుత్వం అప్రమత్తతతోనే భారీ నష్టం తప్పింది
- నిరంతరం వరద బాధితుల మధ్యే సీఎం చంద్రబాబు ఉన్నారు
- ప్యాలెస్ జగన్మోహన్‌రెడ్డి బురద జల్లడం హాస్యాస్పదంగా ఉంది
- ఆయన ప్రవర్తన చూస్తుంటే పిచ్చి ముదిరి పాకాన పడినట్టుంది
- మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
నెల్లూరు(చైతన్యరథం): ఏలేరు రిజర్వాయర్‌కు వరదలు జగన్ మేడ్ మిస్టేక్ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో గత ప్రభుత్వంలో ఆధునికీకరణను అటకెక్కించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని, నేడు కూటమి ప్రభుత్వం అప్రమత్తతతోనే భారీ నష్టం తప్పిందని వ్యాఖ్యానించారు. నెల్లూరులో విలేకరుల సమావేశంలో చంద్రబాబుపై జగన్‌రెడ్డి విమర్శల ను తిప్పికొట్టారు. ఇటీవల భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్‌కు భారీగా వరద పోటెత్తి పొలాలు ముంపునకు గురయ్యాయి. చింతపల్లి, వై.రామవరం, కేడీపేట ప్రాంతాల్లో ఒక్క రోజు కురిసిన 15 సెం.మీ వర్షంతో ఊహించని స్థాయిలో వరద వచ్చింది. 47 వేల క్యూసె క్కుల వరద ప్రవాహంతో పంటలు మునిగి రైతులు నష్టపోయారు.
మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ప్రజలకు ముప్పు లేకుం డా కాపాడారు. 2003లో 42 వేల క్యూసెక్కుల ప్రవాహానికి ఏలేరు రిజర్వాయర్ కింద పొలాలు మొత్తం మునిగిపోయాయి. 2020లో జగన్‌రెడ్డి ప్రభుత్వంలో 17 వేల క్యూసెక్కుల ప్రవాహానికే కాకినాడ వరకు మునిగిపోయింది. ఇప్పుడు 47 వేల క్యూసె క్కుల ప్రవాహం వచ్చినా నష్టపరిధిని తగ్గించడంలో ప్రభుత్వం చాలావరకు సఫలమైందని తెలిపారు. వరద బాధితులను పరామర్శించేందుకు టపాసులు కాల్చుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏలేరు వరద మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్‌రెడ్డి అం టున్నారు…అవును అది ముమ్మాటికీ మ్యాన్ మేడ్ మిస్టేకే…ఆ మ్యాన్ జగన్‌రెడ్డే..అది జగన్ మేడ్ మిస్టేకేనని మండిపడ్డారు.
ఏలేరు కాలువ ఆధునికీకరణను అటకెక్కించారు..
ఏలేరు వరదకు కారణమైన కాలువలో ప్రవాహ స్థాయిని 10 వేల క్యూసెక్కుల నుంచి 70 వేల క్యూసెక్కులకు పెంచేందుకు 2019లో మా ప్రభుత్వం రూ.292 కోట్లు పనులకు టెండర్ పిలిచింది. టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు మొదలు పెట్టే సమయంలో మా ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కాలువ ఆధునికీకరణ పనులను మూలనపెట్టేశారు. ఐదేళ్ల పాలనలో ఆ కాలువ పనుల జోలికే పోలేదు.. ఇదే జగన్ చేసిన తప్పిదం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని రాజకీ యం చేసే జగన్‌రెడ్డికి క్యూసెక్, టీఎంసీ, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోకు తేడా తెలియదు. వరద బాధితులను పరామర్శించడం కూడా చేతకాని వ్యక్తి. దోచుకునే అవకాశం లేకుండా పోయిందని కుట్ర పూరిత రాజకీయాలు మొదలుపెట్టాడని ధ్వజమెత్తారు.
రాష్ట్రపతి పాలన కావాలా?
ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి కూటమికి 164 సీట్లు ఇస్తే ఆయనకు రాష్ట్రపతి పాలన కావాలంట. అర్జెంటుగా ఆయన సీఎం సీటులో కూర్చోవాలని కలలు కంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు. జగన్‌రెడ్డి పాలనలో కీలక శాఖలైన ఇరిగేషన్, వ్యవసాయాన్ని మూతేశారు. 2014-19 మధ్య మా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజన కారణంగా ఆర్థిక కష్టాలున్నప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.63 వేల కోట్లు ఖర్చుపెట్టాం. 2019-24 మధ్య అదే స్థాయిలో పనులు జరగాలంటే పెరిగిన ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం రూ.20 వేల కోట్లే. ఆ నిధుల విషయంలో కూడా కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పెద్దిరెడ్డి, చిన్నిరెడ్డితో పాటు ఆ రెడ్డి..ఈ రెడ్డి ప్రయోజనాల కోసం వాళ్లు కోరిన జిల్లాల్లో వారికే ఇచ్చి ఆ నిధులను కూడా రైతులకు ఉపయోగపడకుండా చేశారు. ఆ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మంత్రి రికార్డింగ్ డ్యాన్సులు, స్టెప్పులకు పరిమితమయ్యారు. సీఎం పబ్జీ ఆటతో గడిపేశారు..ఇక ఇరిగేషన్ శాఖను పట్టించుకున్నదెవరని ప్రశ్నించారు.
అభినందించాల్సింది పోయి విమర్శలా?
ఏలేరు రిజర్వాయర్‌పై నిరంతరం పర్యవేక్షణ జరిపి నష్ట నివారణ చేసిన ఇంజనీరింగ్ అధికారులను అభినందించాల్సింది పోయి విమర్శించడం జగన్ సైకో నైజానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ఇన్ని దుర్మార్గాలు చేసిన ఆయన ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. విజయవాడకు వెళ్లి ఆరోపణలు చేస్తాడు..ఏలేరుకు పోయి తిడతాడు. ఊహించని వరదలతో రెండు రాష్ట్రాలు మునిగిపోతే కామన్ సెన్స్ లేకుండా వికృతంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఆయనకు ఆయ నను మ్యాడ్ అనాలో..సైకో అనాలో అర్థం కాని పరిస్థితి..పిచ్చి ముదిరి పాకాన పడటంతోనే ఇలా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించారు.
ఆదుకోవడంలో చంద్రబాబు..దోచుకోవడంలో జగన్‌రెడ్డి
వరదల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో చంద్రబాబు రోల్ మోడల్‌గా నిలిచారని, నేడు దేశమంతా ఈ విషయం చర్చించుకుంటోందని తెలిపారు. బురద, వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా పడవలు, జేసీబీల్లో తిరుగుతూ పది రోజుల పాటు ప్రజల మధ్యే ఉన్నారు. సీఎం నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అవిశ్రాంతంగా పనిచేశా రు. మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుల తరబడి పొర్లు కట్టలపైనే ఉండి నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌ను వదిలి బయటకురాని జగన్‌రెడ్డి 13 సీబీఐ, ఈడీ కేసులతో లక్షల కోట్లు దోచుకోవడంలో రోల్ మోడల్‌గా నిలిచాడని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు రూ.కోటి విరాళం ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌రెడ్డి ప్రజాధనం దోచుకుని రూ.3.5 లక్షల కోట్లు పోగేసుకుని కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి రూ.కోటి మాత్రమే ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఏలేరు రిజర్వాయర్ వరద ముమ్మాటికీ జగన్ మేడ్ మిస్టేకేనని స్పష్టం చేశారు.