అమరావతి(చైతన్యరథం): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్‌ఎమ్‌ఆర్ పెదబాబు మంగళవారం టీడీపీలో చేరారు. దీంతో ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ పసుపు కండువాలు కప్పిన లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.