- వైసీపీ నేతల అవినీతికి ఉద్యోగులు బలికావాలా?
- ఆత్మహత్యలొద్దు.. ఆత్మస్దైర్యంతో ఉండండి
- నరహంతక జగన్ పాలనని అంతమొందిద్దాం
- ఉద్యోగులకు టీడీపీ యువనేత లోకేష్ పిలుపు
అమరావతి: వైకాపా నేతల అవినీతి, అక్రమాలు, వేధింపులతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిననాటి నుంచీ సాగిస్తున్న అవినీతి, అరాచక పాలనకి వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు బలయ్యారని, ఇవన్నీ జగన్ సర్కారు చేసిన హత్యలేనని లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారం కోసం సొంత బాబాయ్‌ని బలిచ్చిన జగన్ గ్యాంగ్ తమ దోపిడీకి సహకరించని ప్రభుత్వ ఉద్యోగులను అడ్డు తొలగించుకుంటున్నారని మండిపడ్డారు. వైకాపా నేతల అవినీతికి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు బలి కావాలని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్ల పాలనలో వందలాది మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, ఈ వారంలో ముగ్గురు బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఫ్యాక్షన్ సైన్యాలను ఆత్మస్దైర్యంతో ఎదుర్కోండి, మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
విశాఖజిల్లాలో వైకాపా భూ అక్రమాలకు సహకరించలేదని వైకాపా నేతలే తహసీల్దార్ సనపల రమణయ్యని అత్యంత దారుణంగా చంపేయడం జగన్ పాలనలో ప్రభుత్వ అధికారుల ప్రాణాలకు రక్షణలేదని తేలిపోయింది. బాపట్ల జిల్లా చావలి గ్రామ ఆర్బీకేలో వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్న బీ పూజిత ఆత్మహత్యకు కారణం వైకాపా నేతలు ఎరువులు ఎత్తికెళ్లిపోవడమే. బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతిని బలిగొన్నది వైకాపా నాయకులే. విజయనగరం జిల్లా రాజాంలో పంచాయతీరాజ్ శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న జేఈ వల్లూరు రామకృష్ణని మాయచేసి వైకాపా నేతలు సిమెంటు ఎత్తుకెళ్లారు. ఒకపక్క సిమెంటు లెక్క చెప్పమంటూ ఉన్నతాధికారులు ఒత్తిళ్లు, మరోపక్క దిక్కున్నచోట చెప్పుకోమని వైకాపా నేతల బెదిరింపులతో, దిక్కుతోచని రామకృష్ణ పంచాయతీరాజ్ కార్యాలయంలోనే ఉరివేసుకుని తనువు చాలించారు. ఇది వైకాపా నేతలు చేసిన హత్య కాదా? అని లోకేష్ ప్రశ్నించారు.
ఇంకా రెండు నెలలే సమయం..
మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ని ఎలా వెంటాడి వేధించి చంపారో దేశమంతా చూసింది. డాక్టర్ అచ్చెన్న వంటి దళిత మేధావిని అంతమొందించిందీ జగన్ నరహంతక సర్కారే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం ఉద్యమించిన ఉపాధ్యాయులపై కక్ష కట్టి బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. 13 యాప్‌లతో పని ఒత్తిడి పెంచి వందలాది టీచర్ల మరణాలకు కారణమైన జగన్ ఫ్యాక్షన్ సర్కారు అంతానికి ఇంకా 2 నెలలే సమయం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మస్దైర్యంతో ఉండాలని… తప్పులు చేసిన వైకాపా నేతలు కాలరెగరేసుకుని తిరుగుతుంటే..ఏ తప్పూ చేయని మీరెందుకు ఆత్మహత్యలకు పాల్పడాలని ప్రభుత్వ ఉద్యోగులను లోకేష్ ప్రశ్నించారు. త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను వేధించిన వైకాపా నాయకుల్ని కఠినంగా శిక్షిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.