తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి తలపెట్టిన యువగళం పాదయాత్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పాదయాత్ర అనుమతిపై నిర్ణయం వెలువరించేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడి అనివార్య పరిస్థితుల్లో అందుకు అనుమతించింది. తెలుగురాష్ట్రాలలో ఇప్పటివరకూ ఎవరూ చేయనివిధంగా విభిన్న రీతిలో లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగువందల రోజుల పాటు ఏకధాటిగా పాదయాత్ర నిర్వహించటం ఒకవిధంగా సాహసమే. అయితే లోకేష్ కు మొదటి నుంచి క్లిష్టతరమైన లక్ష్యాలను ఎంచుకొని దానిని ఒక సవాల్ గా స్వీకరించటం అలవాటు.
మూడు దశాబ్దాలుగా పార్టీ పతాకమే ఎగురని మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలన్న లోకేష్ నిర్ణయం అప్పట్లో అందర్నీ విస్మయ పరచింది. లోకేష్ కోరుకుంటే పార్టీ సునాయాసంగా గెలుపొందే సురక్షిత స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏవిధమైన ఆక్షేపణ వుండదు. కానీ లోకేష్ అందుకు ఇష్టపడలేదు. మంగళగిరిని ఎంచుకోవటం ద్వారా లోకేష్ ప్రత్యర్థి పార్టీలకు బలమైన సంకేతం పంపించారు. ఎన్నికలలో సాంకేతికంగా ఓడినప్పటికీ, కసితో పట్టుదలతో పనిచేసి ప్రజాహృదయ విజేతగా నిలిచారు.
తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాదు, సామాన్య ప్రజానీకానికి సైతం ఒక భరోసా కల్పించటంలో లోకేష్ సఫలీకృతుల్యారు. ఏమాత్రం భేషజాలు లేకుండా, చిన్నా, పెద్దా అందర్నీ పేరుపేరునా వరుసలుపెట్టి ప్రజలతో మమేకం అవుతున్న తీరు అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరినీ స్వయంగా కలుసుకునేందుకు యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర తలపెట్టడం సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం అని చెప్పవచ్చు.