- పరిరక్షణకు సమష్టిగా ముందుకు కదలాలి
- ఎన్జీవోలు, నిపుణుల సూచనలు తీసుకుంటాం
- కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
- విజయవాడలో పీసీబీ ఆధ్వర్యంలో వర్క్‌షాపు
విజయవాడ (చైతన్య రథం): ‘పర్యావరణ హితమనేది పరిశ్రమల బాధ్యత కావాలి. అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు భావి తరాలకు చక్కటి పర్యావరణం అందించడం బాధ్యతగా భావించాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతమవ్వాలంటే పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. అదే సమయంలో కాలుష్య రహిత పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. విజయవాడలో బుధవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఎన్జీవోలు, నిపుణులు, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన వర్క్ షాపును పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ ‘భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేసే అభివృద్ధి సరికాదు. కాలుష్య నియంత్రణ మండలి అనగానే పరిశ్రమలకు వ్యతిరేకమనే భావన సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ, అభివృద్దిపథంలో ముందుకు సాగడం రెండూ కీలకమన్నారు. దీనికి తగిన మార్గాలను అన్వేషించాలని, నిపుణులు దీనిపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో తీవ్రమవుతున్న పారిశ్రామిక కాలుష్య నివారణకు ప్రజామోదయోగ్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటీవలికాలంలో పరిశ్రమల్లో కాలుష్యంతోపాటు ప్రమాదాలూ పెరుగుతున్నాయన్నారు. వీటి నివారణకు ఓ మార్గం చూడాలని పవన్ అధికారులకు సూచించారు. ‘974 కిలోమీటరుగావున్న కోస్టల్ కారిడార్‌ను అభివృద్ది చేయాలి. పర్యావరణ సమతౌల్యం దెబ్బ తినకుండా పరిశ్రమల ఏర్పాటవ్వాలి. భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పటినుంచే ఆలోచన చేయాలని, జల, వాయు కాలుష్యాలను నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తున్న సమయంలో కాలుష్యరహిత పరిశ్రమలు, వాటి విధివిధానాల రూపకల్పనకు నిపుణులు, మేధావులు విలువైన సూచనలు అందించాలని పవన్ కోరారు.
అలాంటి సూచనలు సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. పర్యావరణం మేలు గురించి ఎన్జీవోలు చేస్తున్న కృషిని అభినందించారు. వర్కుషాపు ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణపై సామాన్యులకూ స్పష్టత రావాలన్న కాంక్ష వ్యక్తం చేశారు. కాలుష్యరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి కృష్ణయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.